ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని భయభ్రాంతులకు గురిచేసి, ఆమె మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు లాక్కెళ్ళాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మండల కేంద్రంలోని వినాయక్ నగర్ కాలనీలో జరిగింది.బాధితురాలు, స్థానికుల కథనం ప్రకారం.. వినాయక్ నగర్ కాలనీకి చెందిన ఏమోనుల లింగవ్వ తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు.
బుధవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఆమె వాష్ రూమ్ నిమిత్తం బయటకు వచ్చి, తిరిగి ఇంట్లోకి వెళ్తున్నారు. అదే సమయంలో మాటు వేసిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా కాంపౌండ్ గోడ దూకి లోపలికి ప్రవేశించి లింగవ్వ కు ముఖానికి గుడ్డ ముక్క కప్పి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును బలంగా గుంజుకొని చీకట్లో పరారయ్యాడు.
బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు, అప్పటికే దొంగ పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
