- పార్టీ ఏదైతేనేం పలుకుబడే ముఖ్యమంటున్న నాయకులు
- నేతల తీరు చూసి నివ్వేరబోతున్న సామాన్య జనం
( జాన రమేష్. ఇది సంగతి . ఆర్మూర్ )
చెరువులో కప్పలకు తామేమి తీసిపోము అన్న చందంగా కనబడుతున్నారు నేటి తరం రాజకీయ నేతలు. నిన్న మొన్నటి వరకు అధికారం లో వున్న బిఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు నేడు రంగు మార్చుకుని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కండువా మార్చుకుంటున్నారు.
క్షణంలో రంగులు మార్చే ఊసరవెల్లికి మించి ఉన్న వీరి చేష్టలను చూస్తున్న ప్రజలు ఔరా అంటూ నివ్వెరబోతున్నారు. గతంలో రాజకీయాలలో ఉన్న నేతలు విలువలకు ప్రాథన్యత ఇచ్చేవారు. కానీ నేటి తరం రాజకీయాలలో సీన్ రివర్స్ గా కనబడుతుంది. పార్టీ ఏదైతేనేం తమ పలుకుబడి తమకు ముఖ్యం అన్న చందంగా విచిత్ర పరిస్థితి కనబడుతోందని పలువురు సీనియర్ రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో తమను నమ్ముకున్న ప్రజల కోసం సేవ చేసేందుకు నేతలకు రాజకీయం ఒక ప్లాట్ ఫామ్ గా ఉండేది కానీ నేడు అది తమ భవిష్యత్తును సెటిల్మెంట్ చేసుకునే ఓ వరప్రదాయినిగా మారింది. గతంలో తాము నమ్ముకున్న నాయకుడి కోసం నష్టాలను సైతం లెక్కచేయని ద్వితీయ శ్రేణి నాయకులు కనబడేవారు. గత తరపు లీడర్లు విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం నైతిక విలువలే ప్రాధాన్యంగా తమ రాజకీయ భవిష్యత్తును నేతలు కొనసాగించేవారు.
కానీ నేడు మాటకు మతిలేని… విలువలకు గతి లేని విధంగా ఉన్న రాజకీయ వ్యభిచారులను చూస్తున్న విచిత్ర పరిస్థితి కనబడుతోంది. దీంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో సైతం గత తొమ్మిదేళ్లుగా పార్టీ జెండాను మోసుకొని వస్తున్న కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధిష్టానం పైన ఉంది. లేదంటే హస్తం పార్టీ కూడా వలస నేతలతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనే భావాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు కాంగ్రెస్ వాదులు.
మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది. భవిష్యత్తులో ఇంకెంత విచిత్ర పరిస్థితి చూడాల్సివస్తుందో వేచి చూడాల్సిందే !