మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
దీంతో శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. తెల్లవారుజామున 4:30 గంటల నుంచే ఆలయంలో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో కూడిన పంచామృతాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం స్వామివారిని పట్టువస్త్రాలు, విశేష పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ మాస శివరాత్రి ఎంతో విశిష్టమైనదని పండితులు పేర్కొన్నారు. దాదాపు 225 ఏళ్ల కాలంలో ఇలాంటి అరుదైన పుణ్యతిథి కేవలం తొమ్మిది సార్లు మాత్రమే వస్తుందని వారు వివరించారు.
అలాంటి ప్రత్యేకత కలిగిన ఈ ఒక్క మాస శివరాత్రిని దర్శించుకోవడం వంద శివరాత్రుల ఫలంతో సమానమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా ప్రజలందరూ ఈ పర్వదినాన శ్రీ నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకుని, ఆయన అనుగ్రహం పొందాలని పండితులు కోరారు.
