HomeCRIMEమావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ..తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి దంపతులు?

మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ..తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి దంపతులు?

అజ్ఞాతంలోకి వెళ్లిన మూడు దశాబ్దాల తర్వాత జనజీవన స్రవంతిలోకి..రూ. 20 లక్షల రివార్డు కలిగిన అగ్రనేత లొంగుబాటుపై సర్వత్రా ఉత్కంఠనిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి కోలుకోలేని భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ఆ పార్టీ కేంద్ర కమిటీ (సెంట్రల్ కమిటీ) సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఆయన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.

గత కొన్ని రోజులుగా వీరి లొంగుబాటుపై విస్తృతంగా ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఆ వార్తలు నిజమేనని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన నరహరి, జార్ఖండ్‌కు చెందిన ఆయన భార్యతో కలిసి రాష్ట్ర పోలీస్ బాస్ (డీజీపీ) సమక్షంలో లొంగిపోయినట్లు పోలీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా దీనిపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

1980వ దశకంలో ఎల్‌బీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో నాటి పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతి రణదేవ్ వంటి అగ్రనేతల సిద్ధాంతాలకు ఆకర్షితుడై నక్సలిజం వైపు అడుగులు వేశారు. ఆ తర్వాత 1996లో ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు.

ప్రస్తుతం 57 ఏళ్ల వయసు కలిగిన నరహరిపై ప్రభుత్వం రూ. 20 లక్షల రివార్డును ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా అజ్ఞాతంలో ఉన్న నరహరి, మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.

ప్రస్తుతం ఆయన జార్ఖండ్‌లోని ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

జార్ఖండ్‌లోని సరండా అటవీ ప్రాంతంలో పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు ఇతర అగ్రనేతల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ తీవ్రతరం చేయడం, మరోవైపు నరహరి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతోనే ఈ దంపతులు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.

పార్టీ వ్యూహరచనలో కీలకమైన సెంట్రల్ కమిటీ సభ్యుడి హోదాలో ఉన్న నరహరి లొంగుబాటు వార్త మావోయిస్టు శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అగ్రనేతల మరణాలు, అరెస్టులతో బలహీనపడిన మావోయిస్టు యంత్రాంగానికి ఈ లొంగుబాటు మరింత పెద్ద దెబ్బగా మారనుందని రాజకీయ, పోలీస్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వ్యవహారానికి సంబంధించి త్వరలోనే పోలీస్ శాఖ అధికారికంగా వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments