దాదాపు దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన మండవకు పదవులు వచ్చినట్లే వచ్చి చేజారుతున్నాయి. చివరి దాక ఊరించిన ఎంపీ టికెట్ కూడా ఆయనకు దక్కలేదు. ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపడానికి కాంగ్రెస్ పెద్దలు మండవ ను సంప్రదించారు. ఆయన కూడా ఓకే అన్నారు. ఖమ్మం టికెట్ విషయంలో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మద్యే మార్గంగా రేవంత్ రెడ్డి మండవ పేరు ను తెరమీదికి తెచ్చారు.
కమ్మ సామాజికవర్గంనుంచి మండవ బలమైన నేతగా ఉన్నారు. కమ్మ కార్పొరేషన్ విషయంలోనూ ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తెచ్చారు. అదీగాక ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్ రావు కు అత్యంత సన్నిహితుడు. ఖమ్మం లో కమ్మ సామజిక వర్గ వోట్లు ఎక్కువగా ఉన్నాయి.అందుకే మండవ నే బలమైన అభ్యర్థిగా రేవంత్ రెడ్డి భావించారు.మండవ అభ్యర్థిగా ఉంటె టీడీపీ వోట్లు కూడా టర్న్ అవుతాయని అంచనా వేశారు. ఈ జిల్లాలో తనదైన ముద్ర కోసం చూస్తున్న రేవంత్ రెడ్డి మండవ ను ముందుపెట్టి పావులు కదిపే ఎత్తుగడ వేశారు.
కానీ నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ ను తమ జిల్లా మీద రుద్దడం ఫై ఖమ్మం జిల్లా నేతలు ససేమిరా అన్నారు దీనితో అధిష్టానం చివరికి పొంగులేటి వైపే మొగ్గుచూపింది.టికెట్ రాకపోయినా రాబోయే రోజుల్లో మండవ కు కీలక పదవీ కట్టబెట్టే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారనే చర్చ కాంగ్రెస్ నేతల్లో ఉంది.దాదాపు మూడు దశాబ్దాల పాటు టీడీపీ లో ఉన్న ఆయన ఎమ్మెల్యే గా మంత్రి గా సుదీర్ఘ కాలం పనిచేసారు. పార్టీలో పాలనలో ఆయన తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. మచ్చ లేని నేతగా ముద్ర వేసుకున్నారు.
కానీ తెలంగాణ ఉద్యమ తరుణంలో రాజకీయాలకు దూరం అయ్యారు. కెసిఆర్ రెండో సారి సీఎం అయ్యాక నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కెసిఆర్ తో ఉన్న దోస్తాని కాదనలేక గులాబీ కండువా కప్పుకున్నారు. కానీ పార్టీలో ప్రబుత్వంలో క్రియాశీల పాత్ర మాత్రం పోషించలేక పోయారు. దీనితో మండవ నొచ్చుకున్నారు. మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కి వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఒత్తిడి తో కాంగ్రెస్ కండువా వేసుకున్నారు.
ఓ దశలో ఆయనే నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అందుకే భూపతి రెడ్డి మండవ ఫై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.అయినప్పటికీ ఎన్నికలో మండవ కాంగ్రెస్ పక్షాన తెరవెనుక అత్యంత కీలకంగా పనిచేసారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మండవ కు అందలం దక్కడం ఖాయమనే ధీమాలో ఆయన వర్గీయులున్నారు.
కానీ కీలక పదవులు చేజారుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఖాళీ అయిన ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాల్లో ఏదోకటి మండవ కు సర్దుబాటు చేస్తారని భావించారు. కానీ నిరాశే ఎదురయ్యింది. లోకసభ ఎన్నికల పక్రియ పూర్తీ అయ్యాక మండవ కు అందలం దక్కడం ఖాయం అని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ లేదంటే రాజ్య సభ స్థానాల్లో సర్దు బాటు చేయడం ఖాయమనే ధీమా ఉంది