HomeCRIMEఫారెస్ట్ అధికారులపై గిరిజనుల మూకుమ్మడి దాడి.. కరెంటు నిలిపివేసి భీభత్సం...అటవీ నరికివేతను అడ్డుకున్న బీట్ అధికారులపై...

ఫారెస్ట్ అధికారులపై గిరిజనుల మూకుమ్మడి దాడి.. కరెంటు నిలిపివేసి భీభత్సం…అటవీ నరికివేతను అడ్డుకున్న బీట్ అధికారులపై విచక్షణారహితంగా దాడులు

  • సెల్ ఫోన్లు లాక్కొని, ఫొటోలు డిలీట్ చేసిన తండావాసులు
  • గాయపడిన సిబ్బంది ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. పోలీసులకు ఫిర్యాదు

అడవులను అక్రమంగా నరుకుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్న అటవీశాఖ అధికారులపై గిరిజనులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ముందుగా వ్యూహాత్మకంగా కరెంటు సరఫరా నిలిపివేసి, చీకటిలో ఈ దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించి బాధితులు, అధికారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని లక్ష్మాపూర్ బీట్, హాజీపూర్ తండా శివారులోని కంపార్ట్మెంట్ నెంబర్ 726లో కొందరు వ్యక్తులు అడవులను విచక్షణారహితంగా నరుకుతున్నారంటూ బుధవారం రాత్రి అటవీశాఖ అధికారులకు పక్కా సమాచారం అందింది.

ఈ సమాచారం మేరకు తిమ్మాపూర్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్, కొండాపూర్ బీట్ ఆఫీసర్ ప్రదీప్ తక్షణమే అప్రమత్తమై హాజీపూర్ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడవులను నరుకుతున్న ఇద్దరు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పట్టుబడిన ఇద్దరు నిందితులను విచారించే నిమిత్తం అటవీ సిబ్బంది వారిని హాజీపూర్ తండాకు తీసుకువచ్చారు. ఆ సమయంలో తండాకు చెందిన సుమారు 50 మంది ఒక్కసారిగా గుమిగూడారు. ప్లాన్ ప్రకారమన్నట్లుగా ముందుగా తండాలో కరెంటు సరఫరాను నిలిపివేశారు. సంపూర్ణ చీకటిని ఆసరాగా చేసుకుని విచారణ జరుపుతున్న అటవీ సిబ్బందిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.

అధికారుల ప్రతిఘటనను లెక్కచేయకుండా వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను లాక్కున్నారు. దాడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు, ఫొటోలు బయటకు రాకుండా ఫోన్లలోని దృశ్యాలను, ఫొటోలను పూర్తిగా డిలీట్ చేశారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు శ్రీనివాస్, ప్రదీప్‌లను హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై ఈ విధంగా భౌతిక దాడికి పాల్పడి, సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి యత్నించడంపై అటవీ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించి, దాడికి పాల్పడిన గిరిజనులపై అత్యంత కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments