రోగుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఆసుపత్రి యాజమాన్యాలు
కమిషన్లు ఇస్తామంటూ ఆర్ఎంపీలకు ఆఫర్లు
రోగులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
జాన రమేష్: ఇది సంగతి; ఆర్మూర్:
ప్రైవేటు ఆసుపత్రులపై సరైన నియంత్రణ లేకపోవడంతో చెప్పిందే బిల్లు… చేసిందే వైద్యం అన్న చందంగా తయారైంది పరిస్థితి.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రోగాలు ప్రజల ప్రాణాలు తీస్తుంటే నయం చేయాల్సిన ఆస్పత్రి యాజమాన్యాలు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పట్టణంలో వైద్యం పేరిట కొన్ని ఆస్పత్రులు చేసే విన్యాసాలు కాసుల కక్కుర్తికి దర్పణంగా నిలుస్తున్నాయి. పేషంట్ల కోసం ప్రైవేటు ఆసుపత్రులు అడ్డదారులు తొక్కుతున్నాయి. పేషెంట్లను తీసుకువచ్చిన వారికి కమిషన్లు ఇస్తామంటూ ఆర్ఎంపీలకు ఆఫర్లు పలుకుతున్నాయి. వెరసి వీరందరూ కలిసి పేషెంట్లను నిలువు దోపిడీ చేస్తున్నారు.
రోగుల నుంచి రెట్టింపు ఫీజులు వసూలు చేస్తూ వచ్చిన దాంట్లో తలా పాపం తిలపిలి పిడికెడు అన్న చందంగా ఎవరి వాటా వారు పంచుకుంటున్నారు.
గతంలో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో అత్యవసర సేవలందించడానికి తక్కువ సంఖ్యలో ఆసుపత్రులు ఉండేవి. నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందిస్తూ ప్రజల పాలిట వైద్యులు దేవుడిలా మారేవారు.
కానీ నేడు మల్టీ స్పెషాలిటీగా ‘ ఆశ ‘ లు లేపుతు ‘లైఫ్’ లతో ఆడుకుంటున్న కార్పొరేట్ ఆసుపత్రుల కారణంగా దవాఖానాల్లో పోటీ పెరిగింది. దీంతో మరి కొన్ని ఆస్పత్రులు కమిషన్ల దందాకు తెరలేపాయి. ఆసుపత్రిలో రోగులను నింపుకునేందుకు మీరు చూపే నైపుణ్యత ‘తిరుమల’ ‘రిషి’ని మరిపిస్తుంది. ఆసుపత్రిలో చేర్పించిన వారికి కమిషన్లు బహుమతుల రూపంలో ఇస్తున్నాయి.
గ్రామీణ స్థాయిలో వైద్యం అందించే కొందరు ఆర్ఎంపీలు, మెడికల్ నిర్వాహకులతో పాటు మరి కొంత మంది ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కనీస సౌకర్యాలు లేని ఆసుపత్రులు కూడా కమిషన్లు చెల్లించి రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. గ్రామాలలో ఉండే కొంతమంది ఆర్ఎంపీలకు కమిషన్ల ఆశ చూపించి తమ ఆసుపత్రికి రోగులు వచ్చే ఏర్పాట్లు చూసుకుంటున్నారు. చిన్నపాటి వ్యాధులతో ఆసుపత్రికి వచ్చిన రోగికి టెస్టుల పేరిట అవసరం లేకున్నా ఎక్కువ మందులను అంటగడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు.
రోగులనుంచి రెట్టింపు ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేసిన ఆర్ఎంపీలకు 20 నుంచి 50 శాతం వరకు కమిషన్లను ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యరంగంపై దృష్టి సారించి కేటగిరీల వారీగా వైద్యానికి ఇవ్వాల్సిన ఫీజుల పట్టిక ఆసుపత్రుల్లో బహిరంగంగా పెట్టి వీరి ఆగడాలను అరికడితే బాగుంటుందని ప్రజల అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే ఈ దోపిడీ జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ప్రైవేటు ఆసుపత్రులతోపిడిని నియంత్రించాలని,ధనర్జనే ధ్యేయంగా కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్న ఈ మెడికల్ మాఫియా పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
