నెల చివరి వారం నుండి కారు మబ్బులు కమ్ముకుంటున్న… మేఘాలు కనికరించకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో వర్షపాతం ఆశాజనకంగా ఉండడంతో రైతులు వరి నాట్లు వేయడానికి సిద్ధమయ్యారు.
ఈ ఖరీఫ్ సీజన్ కోసం వ్యవసాయ క్షేత్రంలో పంటలు వేసేందుకు దుక్కులు దున్నిన రైతులు, వర్షాలు కురియకపోవడంతో మురిపిస్తున్న మేఘాలను చూసి ఈ సీజన్లో సాగుతుందా? అనే సందిగ్ధంలో పడ్డారు.
కారు మబ్బులు తప్ప చినుకు నేల కురియక పోవడంతో రైతులు ఆయా గ్రామాల్లో వరునుడి కరుణ కోసం గ్రామదేవతలకు పూజలు చేస్తున్నారు. ఈ సమయంలో వర్షాలు కురిస్తే సాగు విస్తీర్ణం ఆశాజనకంగా కొనసాగే అవకాశం ఉంటుంది.
నిజామాబాద్ జిల్లాలో 29 మండలాల్లో కొంతమేర ఆశాజనకంగా వర్షాలు కురిసినప్పటికిని పంటల సాగు ఆశించినంతగా ముందుకు సాగడం లేదు. పంటల సాగు కోసం ఇంకా సమయం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
గత ఏడాది ఈ సీజన్లో సాధారణంగా కంటే వర్షపాతం ఎక్కువ నమోదు అయింది. జూన్ చివరి వారం నుండి జూలై మొదటి వారం గడుస్తున్న చినుకు నేల రాలేకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు..ఇప్పటికే వర్షాలు సరిగా కురువకపోవడంతో బోర్లపై ఆధారపడిన రైతులు ఆర్మూర్ డివిజన్లో ఆయా మండలాల్లో అరకొర నీటి వసతితో వరి సాగును వేసేందుకు సాహసం చేస్తున్నారు.
వారితోపాటు ఆరుతడి పంటలైన సోయా, మొక్కజొన్నలను కూడా నాటారు.. వర్షాలు రైతులు ఆశించిన స్థాయిలో ఈ సీజన్లో కురిస్తే బోరుబావులలో కూడా సమృద్ధి అయిన నీరు ఉండే అవకాశం ఉంది. లేదంటే భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం లేకపోలేదని రైతులు అంటున్నారు.
ఈ సీజన్ లో 5.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది వరి 3,13,965 ఎకరాలు, సోయా 85,444 ఎకరాలు, మొక్కజొన్న 57,315 ఎకరాలు, పత్తి28,730 ఎకరాలు, కంది 13,961 ఎకరాలు, పెసర 4,997 ఎకరాలు, మినుము 5,263 ఎకరాల్లో పండించనున్నట్లు అంచనా వేశారు.
నేడు రేపు నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో భారీ వర్షం కురిస్తే రైతులకు మరింత మేలు చేకూరే అవకాశం ఉంది.