కేసులు పెట్టి జైలుకు కాకుండా.. పునరావాస కేంద్రాలకు తరలింపు రూ. కోట్ల విలువైన 991 కేజీల గంజాయి, 4.45 కేజీల అల్ప్రజోలం సీజ్జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డ్రగ్స్ రహిత తెలంగాణ లక్యం కోసం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వింగ్ ‘ఈగల్ ఫోర్స్’ నిజామాబాద్ రీజియన్ పరిధిలో గట్టి నిఘా పెట్టింది.
డైరెక్టర్ సందీప్ శాండిల్య ఐపీఎస్ నేతృత్వంలో జిల్లా నార్కోటిక్స్ విభాగం డీఎస్పీ సోమనాథం, ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్ ల ఆధ్వర్యంలో గత కొద్దిరోజులుగా జరిపిన మెరుపు దాడుల్లో ఏకంగా 140 మంది గంజాయి సేవించే వికృతరూపాలను గుట్టురట్టు చేసింది.
గంజాయి మత్తులో చిక్కుకుని జీవితాలను పాడుచేసుకుంటున్న యువతను కేవలం నేరస్థులుగా చూడకుండా, వారిని మార్చేందుకు అధికారులు మానవీయ కోణాన్ని ఎంచుకున్నారు.
పట్టుబడిన 140 మందిపై 27(బి) ఎన్డిపిఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసినప్పటికీ, డాక్టర్ల నివేదికల ఆధారంగా కోర్టు అనుమతితో నిజామాబాద్‌లోని ‘గవర్నమెంట్ డీ-అడిక్షన్ సెంటర్’కు తరలిస్తున్నారు. అక్కడ నిపుణులైన సైకియాట్రిస్ట్ డాక్టర్లతో ఉచితంగా వైద్యం, కౌన్సిలింగ్ ఇప్పిస్తూ వారిని వ్యసనం నుంచి బయటపడేసే అద్భుతమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇటువంటి అత్యాధునిక పునరావాస కేంద్రం నిజామాబాద్‌లోనే అందుబాటులో ఉందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని అధికారులు సూచించారు.
అలాగే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కెమికల్స్ కలుపుతున్న అల్ప్రజోలం స్మగ్లర్లపై నార్కోటిక్స్ బృందం ప్రత్యేక నిఘా ఉంచి చాకచక్యంగా పట్టుకుంది. ఎన్ఫోర్స్మెంట్ రికార్డుల ప్రకారం.. 2024 నుంచి 2026 మే వరకు ఆర్ఎన్సీసీ (ఆర్ఎన్ సిసి) నిజామాబాద్ పరిధిలో రికార్డు స్థాయిలో991 కిలోల గంజాయి, 4.45 కిలోల అల్ప్రజోలం రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వివిధ కేసుల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న 26 మంది మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ నేరస్థులను వేటాడి పట్టుకున్నారు. ఈ బృందం చూపిన ప్రతిభను యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, జిల్లా ఎస్పీ గిరిధర్, నిజామాబాద్ సీపీ లు ప్రత్యేకంగా అభినందించారు.
మత్తు పదార్థాల విక్రయదారులు యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో ఈగల్ ఫోర్స్ ఎదురుదాడి ప్రారంభించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల పరిధిలోని కళాశాలల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. యువత అంతరాత్మ సాక్షిగా “సే నో టు డ్రగ్స్ – సే ఎస్ టు లైఫ్” “గంజాయి వద్దు – ప్రాణం ముద్దు”అనే నినాదాలను గుండెల్లో ఉంచుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రజలంతా ‘యాంటీ డ్రగ్ సోల్జర్స్’ లాగా బాధ్యతగా పనిచేయాలని పోలీసులు కోరారు.
ఎక్కడైనా గంజాయి సాగు, రవాణా, అమ్మకాలు, కొనుగోళ్లు జరిగితే నిర్భయంగా టోల్ ఫ్రీ నెంబర్:1908, వాట్సాప్ నెంబర్:8712671111 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఎన్డీపీఎస్ కేసులతో జైలు ఊచలు లెక్కించడం ఖాయమని హెచ్చరించారు.
ఈ భారీ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన నార్కోటిక్స్ డీఎస్పీ సోమనాథం, ఇన్స్పెక్టర్ అండె పూర్ణేశ్వర్, ఎస్ఐ సందీప్, పీసీ ఓంకార్‌లతో పాటు సిబ్బందిని పలువురు కొనియాడారు.
