HomeCRIMEమెగా... మాయ!అమృత్ పనుల్లో అంతులేని జాప్యం.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 'అరకొర' పనులు! మెటీరియల్ లేదు.....

మెగా… మాయ!అమృత్ పనుల్లో అంతులేని జాప్యం.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ‘అరకొర’ పనులు! మెటీరియల్ లేదు.. సిబ్బంది కరువు! గడువు ముగుస్తున్నా కదలని వైనం.. అధికారులది మౌన ముద్ర?

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్’ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. పనులు దక్కించుకున్న మెగా కంపెనీ తన పేరుకు తగ్గట్టుగా పనితీరు చూపించాల్సింది పోయి, మమ అనిపిస్తూ కాలయాపన చేస్తోంది. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, మెటీరియల్ కొరత, సిబ్బంది తగ్గింపుతో పనులు అగమ్యగోచరంగా మారాయి.

జిల్లావ్యాప్తంగా సుమారు 45,000 ఇళ్లకు ఆగస్టు నాటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు పూర్తి చేయాలనేది అధికారిక లక్ష్యం. కానీ, మెగా కంపెనీ నిర్లక్ష్యం పుణ్యమా అని ఇప్పటివరకు కేవలం 3,000 ఇళ్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడువు సమీపిస్తున్నా, లక్ష్యంలో కనీసం 10 శాతం కూడా పూర్తి చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రారంభంలో పదికి పైగా టీమ్ లతో ఆర్భాటంగా పనులు మొదలుపెట్టిన మెగా కంపెనీ, ఇప్పుడు ఒక్కో జోన్‌లో కేవలం 3,4 టీమ్ లతోనే పనులు కానిచ్చేస్తోంది. పనులకు అవసరమైన పైపులు, ఇతర మెటీరియల్స్ అందుబాటులో లేవనే సాకుతో పనులను సాగదీస్తున్నట్లు తెలుస్తోంది.

సిబ్బందిని భారీగా తగ్గించేసి, తక్కువ మందితో వెళ్లదీస్తూ పనుల్లో నాణ్యతను గాలికొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెగా కంపెనీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా, సంబంధిత శాఖ అధికారులు మాత్రం కళ్లున్నా చూడలేని ధోరణిలో వ్యవహరిస్తున్నారు.

పనుల పురోగతిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు, కంపెనీ ప్రతినిధులతో కుమ్మక్కయ్యారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను వేగవంతం చేయకపోతే ప్రభుత్వం ఆశించిన ఆశయం నీటిపాలయ్యే ప్రమాదం ఉందనీ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments