HomeCRIMEరాజస్థాన్ 'మేవార్' ముఠా పనేనా? నిజామాబాద్‌లో కేవలం 18 నిమిషాల్లో 'ముప్పై లక్షలు' మాయం!……………ముఠా వేటలో...

రాజస్థాన్ ‘మేవార్’ ముఠా పనేనా? నిజామాబాద్‌లో కేవలం 18 నిమిషాల్లో ‘ముప్పై లక్షలు’ మాయం!……………ముఠా వేటలో అయిదు బృందాలు

నిజామాబాద్ నగరం నిద్రపోతున్న వేళ.. ఖాకీల గస్తీని వెక్కిరిస్తూ అంతరాష్ట్ర ముఠా ఒక్కసారిగా పడగ విప్పింది. జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున అంతరాష్ట్ర ముఠా రెప్పపాటు కాలంలో రెండు ఏటీఎం యంత్రాలను ధ్వంసం చేసి ఏకంగా రూ. 30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. కేవలం 18 నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు చోట్ల దోపిడీ పూర్తి చేయడం పోలీసు యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘాతుకానికి పాల్పడింది రాజస్థాన్‌కు చెందిన ‘మేవార్’ ముఠా అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. గ్యాస్ కట్టర్లు, ఆధునిక పరికరాలతో క్షణాల్లో యంత్రాలను ఛిద్రం చేయడం సాధారణ దొంగలకు ఇది సాధ్యం కాదని, ఏటీఎం యంత్రాల పనితీరుపై పూర్తి అవగాహన ఉన్న నిష్ణాతులైన నేరస్థులే ఈ పని పాల్పడి ఉంటారని పోలీసుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో సుభాష్ నగర్‌లో జరిగిన దోపిడీ యత్నంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠా ప్రమేయం ఉండగా, ప్రస్తుత ఘటన తీరుతెన్నులు రాజస్థాన్ ముఠాల పనితీరును పోలి ఉన్నాయని అనుమానిస్తున్నారు.

ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఇంచార్జి పోలీస్ కమిషనర్, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర హుటాహుటిన నిజామాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దారులన్నింటినీ జల్లెడ పడుతున్నారు. ఈ ప్రొఫెషనల్ గ్యాంగ్‌ను పట్టుకోవడం పోలీసులకు ఇప్పుడు సవాలుగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments