మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మతిభ్రమించిందని, ఆయన రాజకీయ శకం ముగిసిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. ఆదివారం నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి అరాచకాలను ఎండగట్టారు.
“మొన్న జగిత్యాల వెళ్లిన కేసీఆర్.. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని తన పార్టీలోకి ఆహ్వానించడం ఆయన మతిమరుపుకు పరాకాష్ట. సొంత పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకునే సంజయ్‌ని కనీసం సభకు హాజరు కాలేదని అరవింద్ విమర్శించారు.
బీఆర్ఎస్ కుటుంబం రాష్ట్రంలో అత్యంత అవినీతిమయమైన కుటుంబమని, కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఓఆర్ఆర్ వంటి ప్రాజెక్టుల పేరిట భారీ స్కామ్‌లకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన అవినీతి గురించి ఆయన కూతురు కవితను అడిగితే పూర్తి వివరాలు చెబుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గ్రామాల నుంచి పట్టణాల వరకు యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఎంపీ ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిన బీఆర్ఎస్ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై కూడా అరవింద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని, పాలనపై పట్టు కోల్పోయిందని మండిపడ్డారు. ప్రతి సీజన్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే సేకరించారని అధికారుల లెక్కలు చెబుతున్నాయని పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రాలు లేక ధాన్యం రోడ్ల మీద ఎండి నూకలుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వారం రోజుల్లోగా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రూరల్ ఎమ్మెల్యే అత్యంత ప్రజాదరణ లేని వ్యక్తిగా మారారని విమర్శించారు.
10న ప్రధాని మోదీ రాక.. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నట్లు ఎంపీ వెల్లడించారు. రాష్ట్రంలో రూ. 7,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న సన్న బియ్యం పంపిణీ వెనుక ఉన్నది కేంద్ర ప్రభుత్వమేనని, ఎఫ్.సి.ఐ ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. మోదీ లేకుంటే దేశానికి భద్రత లేదు: నిజామాబాద్ జిల్లా ప్రభారి సైదిరెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం లేకపోతే దేశానికి భద్రత లేదని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని నిజామాబాద్ పార్లమెంట్ జిల్లా ప్రభారి సైదిరెడ్డి పేర్కొన్నారు.
ఈనెల 10వ తేదీన ప్రధాని మోదీ భాగ్యనగరానికి రానున్న నేపథ్యంలో, జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలోనే కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ జైత్రయాత్ర కొనసాగిందని, ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో విజయపథంలో దూసుకుపోతోందని సైదిరెడ్డి తెలిపారు.
“దేశవ్యాప్తంగా ఏ సర్వే చూసినా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ విజయానంతరం, తెలంగాణలోనూ అధికారం చేపట్టడమే లక్ష్యంగా ప్రధాని ఇక్కడికి వస్తున్నారు” అని ఆయన వివరించారు.గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కాలక్షేపం చేస్తోందని సైదిరెడ్డి మండిపడ్డారు.
ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లు పనులు చేయాలంటేనే భయపడుతున్నారని, చేసిన పనులకు బిల్లులు వస్తాయో లేదోనన్న ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.రాష్ట్ర రాజకీయాల్లో నిజామాబాద్ జిల్లా ఆదర్శంగా నిలిచిందని, గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకుందని గుర్తుచేశారు.
ఈనెల 10న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయనపిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఈ సభ నాంది పలుకుతుంది.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలి.ఈ సమావేశంలో జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పడలే గంగారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్రవంతి రెడ్డి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
