Thursday, April 16, 2026
HomeLaw and Orderబలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు...కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు…కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని వెల్లడి

నిజామాబాద్, నవంబర్ 29 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. అందరూ ఐకమత్యంగా ఉంటూ, సమిష్టి నిర్ణయం ద్వారా సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అది ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. అయితే అందుకు భిన్నంగా డబ్బుల ప్రలోభాలు చూపి, భయ భ్రాంతులకు గురి చేసి బలవంతంగా ఏకగ్రీవాలు చేయించే ప్రయత్నాలను ఎంతమాత్రం ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఇది ఎన్నికల వ్యవస్థకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని అన్నారు.


రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని అన్నారు.
ఈ తరహా సంప్రదాయానికి చరమగీతం పాడుతూ, స్వేచ్చాయుత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకగ్రీవాల విషయంలో నూతన నియమ నిబంధనలతో మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు.


ఏకగ్రీవ ఎన్నిక అని నిర్ధారణ చేయడానికి ముందు “తప్పనిసరి ధృవీకరణ” విధానాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు. ఏకగ్రీవాల వెనుక ఎలాంటి అంశాలు దాగి ఉన్నాయి అన్నది పరిశీలించేందుకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని, పోటీలో మిగిలి ఉన్న ఏకైక అభ్యర్థితో పాటు, పోటీ నుండి తప్పుకున్న అభ్యర్థుల నుండి లిఖిత పూర్వకంగా డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుందన్నారు.

తమను ఎవరూ బెదరించలేదని పోటీ నుండి వైదొలగిన వారు, తాను ఎవరినీ బలవంత పెట్టలేదని పోటీలో మిగిలిన ఏకైక అభ్యర్థి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వాటిని జిల్లా ఎన్నికల అథారిటీ క్షుణ్ణంగా పరిశీలించి, సమిష్టి నిర్ణయంతో ఏకగ్రీవం అయ్యిందని నిర్ధారణ చేసుకుని నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తారని, ఆ తరువాతే ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలో ఎక్కడైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఏకగ్రీవం చేసినట్లు నిర్ధారణ జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

సదరు ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎన్నిక, ప్రతి గెలుపు ప్రజల అభిప్రాయాన్ని నిజాయితీగా ప్రతిబింబించేలా ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!