నిజామాబాద్ నగరపాలక సంస్థకు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) రాజేంద్రప్రసాద్ కార్పొరేటర్లతో పదవీ ప్రమాణం చేయించారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం కార్పొరేటర్లందరూ ఒక్కొక్కరిగా దైవసాక్షిగా, రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారు. నగర ప్రజల సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తామని వారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్పొరేటర్ల అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంపి అరవింద్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
