HomeHEALTHభానుడి ప్రతాపం.. 9 గంటల నుంచే సుర్రుమంటున్న సూరీడు...42 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. బోసిపోతున్న రహదారులు..వడదెబ్బపై...

భానుడి ప్రతాపం.. 9 గంటల నుంచే సుర్రుమంటున్న సూరీడు…42 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. బోసిపోతున్న రహదారులు..వడదెబ్బపై వైద్యుల హెచ్చరిక.. అప్రమత్తత అవసరమని సూచన..

జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. నిప్పులు చెరుగుతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో, మధ్యాహ్నం అయ్యేసరికి జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది.

గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తుండటంతో సామాన్య ప్రజలు, వాహనదారులు విలవిల్లాడుతున్నారు. ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోత, వడగాల్పులు తోడవడంతో బయట అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

సాధారణంగా వాహనదారులు, బాటసారులతో రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు, రహదారులు మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత భరించలేక జనం ఇళ్లకే పరిమితమవుతుండటంతో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.

సాయంత్రం ఆరు గంటలు దాటినా వేడి తగ్గకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కేవలం మనుషులే కాకుండా, అడవుల్లోని వన్యప్రాణులు కూడా తాగునీరు దొరకక, ఎండ తాళలేక అల్లాడిపోతున్నాయి. గత మూడు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 40 నుండి 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 13వ తేదిన, 41.5°C,ఏప్రిల్ 14న 43.3°C, ఏప్రిల్ 15న 43.8°C, ఏప్రిల్ 16 న 44.3°C, ఏప్రిల్ 17న 43.9°C,ఏప్రిల్ 18న 42.5°C ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో ఉండాల్సిన 70 శాతం నీటి నిల్వలు ఎండ వల్ల చెమట రూపంలో తగ్గిపోవడం వల్ల ‘వడదెబ్బ’ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

శరీరంలో రసాయన చర్యల వల్ల వేడి పెరిగి వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అధికంగా నీరు, ఓఆర్‌ఎస్ ద్రావణం, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. అపస్మారక స్థితికి చేరుకోకముందే తగిన ప్రథమ చికిత్స అందాలి.

అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేయవద్దనీ సూచిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఎండలు ఇలాగే కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగం కోరుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments