ఉమ్మడి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో గత కొంతకాలంగా రైతన్నలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల ముఠా గుట్టును నిజామాబాద్ పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి ప్రధాన నిందితులతో పాటు చోరీ సొత్తు కొనుగోలు చేస్తున్న రిసీవర్లను అరెస్ట్ చేశారు.
మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సాయి చైతన్య కేసు వివరాలను వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల్లో ప్రధాన వ్యక్తి అఫ్టల్ ఖాన్‌తో పాటు A4 అర్బాజ్ ఖాన్ @ షేక్ అల్బాజ్, A5. సిద్దిక్ ఖాన్, A6. మహ్మద్ అఫ్సర్, వీళ్లంతా గతంలో ఆవుల దొంగతనం, బైక్ దొంగతనాలు ఆటో దొంగతనం కేసులలో అరెస్టు అయి జైలుకు వెళ్లినట్లు తెలిపారు.
అయితే A2. అన్సార్@ హుస్సేన్ ఖాన్, A3, షేక్ తాహెర్, వీళ్లిద్దరూ కూడా గతంలో 2024లో దాదాపు 25 ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులలో బోధన్ టౌన్ నుండి అరెస్టయి జైలుకు వెళ్లడం వెళ్లినట్లు తెలిపారు. అక్కడ వారికి పాత నేరస్తులైన అన్సార్, షేక్ తాహెర్‌లతో పరిచయం ఏర్పడి వీరంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడి, సులభంగా డబ్బు సంపాదించేందుకు ట్రాన్స్ ఫార్మర్ల చోరీని వృత్తిగా ఎంచుకున్నారు.
జైలు నుంచి విడుదలయ్యాక గోదావరి పరివాహక ప్రాంతాలైన నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని మారుమూల గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ముఠా తొలుత నందిపేటలో ఒక గ్లామర్ బైక్‌ను దొంగిలించిందన్నారు. పగటిపూట ఆ బైక్‌పై తిరుగుతూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను గుర్తించి (రెక్కీ) చేసేవారు. అర్ధరాత్రి సమయంలో ఆటోలో వచ్చి హాక్సా బ్లేడ్లు, పనాలతో ట్రాన్స్ ఫార్మర్లను పగులగొట్టి లోపల ఉండే ఖరీదైన కాపర్ కాయిల్స్‌ను ఎత్తుకెళ్లేవారు.
ఇలా నవీపేట, నందిపేట, బోధన్, బాసర, బైంసా తదితర ప్రాంతాల్లో మొత్తం 34 చోరీలకు పాల్పడి సుమారు 8 నుంచి 10 క్వింటాళ్ల రాగిని దోచుకున్నారు. చోరీ చేసిన సొత్తును దాచడానికి నిజామాబాద్‌లోని ఏపీహెచ్‌బీ కాలనీలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ రాగి తీగలను వేరు చేసి, సంచుల్లో నింపి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన ప్రధాన రిసీవర్ మహబూబ్ ఖాన్‌కు కిలో రూ. 800 చొప్పున విక్రయించేవారు.
అలాగే నిజామాబాద్, నాందేడ్ ప్రాంతాల్లోని మరికొందరు వ్యాపారులకు కూడా ఈ సొత్తును అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు.
పోలీసుల చాకచక్యం
వరుస దొంగతనాలతో అప్రమత్తమైన పోలీసులు ఏసీపీ ప్రకాష్ యాదవ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కదలికలను గమనించి వారిని పట్టుకున్నారు.
వారిలో అఫ్టల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ @ షేక్ అల్బాజ్, సిద్దిక్ ఖాన్,మహబూబ్ ఖాన్ (రిసీవర్),బొర్గే బాలాజి (రిసీవర్),షేక్ అరీఫ్ (రిసీవర్), మమ్మద్ రాజా (రిసీవర్)లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. మిగతా, అన్సార్ @ హుస్సేన్ ఖాన్ (A2), షేక్ తాహెర్ (A3), మహ్మద్ అఫ్సర్ (A6) ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వారి రికవరీ చేసిన సొత్తు: 1.20 క్వింటాళ్ల కాపర్ కాయిల్స్, రూ. 2.75 లక్షల నగదు, ఒక ఆటో, రెండు బైకులు, దొంగతనానికి వాడిన పనిముట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట ఎస్సై శ్రీకాంత్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్,యాదగిరి గౌడ్, గంగాధర్, ఏ ఎస్ఐ గఫర్, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుల్ రాజారెడ్డి, సందీప్, అబ్బులు, శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేగౌడ్, నాగరాజు, శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్, సందీప్,శ్రీనివాస్ ఇతర సిబ్బందిని సిపి అభినంధించారు.
