‘
నిజామాబాద్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ భూతం మళ్ళీ పడగ విప్పింది. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడమే ఆలస్యం.. బెట్టింగ్ నిర్వాహకులు తమ నెట్‌వర్క్‌ను చాపకింద నీరులా విస్తరిస్తున్నారు. గతంలో కేవలం నగరాలకే పరిమితమైన ఈ వ్యసనం, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని పల్లెటూళ్లకు కూడా పాకింది.
అమాయక యువతను ‘ఈజీ మనీ’ ఆశచూపి నిలువునా ముంచుతున్నారు. జిల్లా కేంద్రంలో ఈ బెట్టింగ్ దందాను నలుగురు వ్యక్తులు ప్రధాన ‘పిల్లర్లు’గా ఉండి నడిపిస్తున్నట్లు సమాచారం. వీరు నేరుగా రంగంలోకి దిగకుండా, సాంకేతికతను అడ్డం పెట్టుకుని వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ఈ గ్రూపుల్లోకి యువకులను చేర్చుకుని, నిమిషాల్లో లక్షల రూపాయలు చేతులు మారుస్తున్నారు. గతేడాది ఐపీఎల్ సమయంలో కూడా వీరు చురుగ్గా ఉండగా, పోలీసులు కేసులు నమోదు చేశారు.వారితో అనుచరులైన మరో ఇద్దరి పై కూడా కేసులు నమోదు అయ్యాయి.
గత ఏడాది కేసుకు అయ్యిన ఇద్దరు వ్యక్తులను నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో, ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్ బృందం ఆ ఇద్దరిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ పోలీసులు ఆన్‌లైన్ బెట్టింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించడంతో బెట్టింగ్ మాఫియాలో వణుకు మొదలైంది.
ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ నలుగురు ప్రధాన నిందితుల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తీసుకుంటున్న కఠిన చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా నిజామాబాద్ పోలీసింగ్ వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
“బెట్టింగ్ నిర్వహిస్తే ఎంతటి వారైనా వదిలేది లేదు” అనే సంకేతాన్ని పంపడంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. పోలీసులు నిఘా పెంచడమే కాకుండా, గ్రామాల్లో కూడా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
