HomeCRIMEవిధులు పన్నులకే.. కానీ పెత్తనం అంతటా!పన్నుల వసూళ్లు వదిలి.. పైరవీలకే ప్రాధాన్యం..నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వార్డు...

విధులు పన్నులకే.. కానీ పెత్తనం అంతటా!పన్నుల వసూళ్లు వదిలి.. పైరవీలకే ప్రాధాన్యం..నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వార్డు అధికారుల ఇష్టారాజ్యం

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు అవినీతికి అడ్డాగా, నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నగర ప్రజలకు సేవ చేయాల్సిన ‘వార్డు అధికారులు’.. తామే ఈ సామ్రాజ్యానికి చక్రవర్తులమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

బల్దియాలో మొత్తం 60 మంది వార్డు అధికారులు ఉండగా, అందులో 40 మంది గ్రూప్-4 ద్వారా నియమితులయ్యారు. మిగిలిన 20 మంది ఇంచార్జీలుగా కొనసాగుతున్నారు. కేవలం పన్నుల వసూలుకే వీరు పరిమితం కావాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరి బాధ్యత కేవలం పన్నుల వసూలు మాత్రమే. కానీ, నగరంలోని పలు వార్డుల అధికారులు రెవెన్యూ విభాగంలో ఇష్టారాజ్యంగా పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంటి పన్నుల నిర్ధారణలో వీరు తలదూరుస్తూ.. అధికారులకంటే ముందే ఇంటి యజమానులతో ‘బేరసారాలు’ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

“ఇది నా ఏరియా.. ఇక్కడ నా మాటే చెల్లుతుంది” అంటూ యజమానులను భయభ్రాంతులకు గురిచేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ చిన్న పని కావాలన్నా ‘చెయ్యి తడపనిదే’ ఫైలు కదలని పరిస్థితి నెలకొంది.

వార్డు అధికారుల ఆగడాలు ఏ స్థాయికి చేరాయంటే.. సాక్షాత్తూ ఉన్నతాధికారులనే బెదిరించే స్థాయికి దిగజారారు. పన్ను వసూళ్లు పెంచాలని ఆదేశించినందుకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఓ ఉన్నత అధికారినే వీరు హెచ్చరించినట్లు సమాచారం.

ఇంత జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్ కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఉన్నతాధికారులకే రక్షణ లేని చోట, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని చాలా వార్డుల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ చిన్న పని కావాలన్నా వార్డు అధికారికి ‘నజరానా’ సమర్పించాల్సిందే. క్షేత్రస్థాయిలో వార్డు పనుల పర్యవేక్షణ ముసుగులో కాంట్రాక్టర్ల వద్ద నుంచి కూడా కమీషన్లు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం, క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం లేకపోవడంతో వార్డు అధికారులు ఆశావహుల పాలిట యమపాశాల్లా మారుతున్నారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సాగుతున్న ఈ ‘వార్డు దందా’పై విచారణ జరిపించాలని, అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments