జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టు ఒక గేటును ఎత్తివేసి 510 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలినట్లు ఏ ఈ సుకుమార్ తెలిపారు. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 890 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని నిల్వ ఉంచి, 510 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ప్రాజెక్టులో 458.00 మీటర్లకు గాను 457.83 మీటర్ల నీటిమట్టం నిల్వ ఉందని, అలాగే 1.237 టీఎంసీలకు గాను 1.196 టీఎంసీల నీరు నిలువ ఉందన్నారు.
కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం నుండి వరద నీరు వస్తున్న కారణంగా, సోమవారం నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల చేయడం జరుగుతుందని, కౌలాస్ నాలా ప్రాజెక్ట్ గేట్ల దిగువ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరారు.
ప్రత్యేకంగా, చేపలు పట్టే వారు, గొర్రెల కాపరులు, రైతులు, పశువుల కాపరులు, ఇతర ప్రజలు కౌలాస్ నాలా వాగు పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది.
పశువులు, గొర్రెలు, ఇతర మూగజీవులను కూడా వాగు పరివాహక ప్రాంతంలోకి వెళ్లకుండా చూడవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా అధికారులు తెలిపారు.
