HomeCRIMEపోలీస్ బాస్ ‘సాయి చైతన్య’ పాలనకు ఏడాది: శాంతిభద్రతలే లక్ష్యంగా సాగిన ప్రస్థానం!సరికొత్త ఉత్తేజంతో కమిషనరేట్...

పోలీస్ బాస్ ‘సాయి చైతన్య’ పాలనకు ఏడాది: శాంతిభద్రతలే లక్ష్యంగా సాగిన ప్రస్థానం!సరికొత్త ఉత్తేజంతో కమిషనరేట్ పోలీసింగ్

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అడుగుపెట్టిన ఏడాది కాలంలోనే జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి, ప్రజల మనిషిగా నీరాజనాలు అందుకుంటున్నారు ప్రస్తుత సీపీ సాయి చైతన్య. కేవలం ఏసీ రూములకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో లాఠీ పట్టిన సామాన్య కానిస్టేబుల్‌కు సైతం ధైర్యాన్నిస్తూ, ప్రజల్లో ‘భరోసా’ కల్పిస్తూ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు.

ఒకప్పుడు జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన రౌడీ షీటర్ల ఆటలకు సీపీ చెక్ పెట్టారు. హైదరాబాద్ తరహాలో ఆపరేషన్ చబుత్రా ను సమర్థవంతంగా అమలు చేస్తూ, రాత్రివేళల్లో రోడ్లపై న్యూసెన్స్ చేసే ఆకతాయిలపై ఉక్కుపాదం మోపారు.

రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచడమే కాకుండా, పాత నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించారు. ఫలితంగా జిల్లాలో నేరాల రేటు తగ్గడమే కాకుండా, సామాన్య ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. యువత భవిష్యత్తును చిదిమేస్తున్న గంజాయి మహమ్మారిపై సీపీ రాజీలేని పోరాటం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల నుండి జిల్లాలోకి మాదకద్రవ్యాలు చొరబడకుండా చెక్‌పోస్టులను బలోపేతం చేశారు.

విక్రేతలపై కఠినమైన పీడీ యాక్టులను ప్రయోగిస్తూ, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా కఠిన వ్యూహాలను అమలు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రత్యేక సైబర్ విభాగాన్ని పటిష్టం చేయడమే కాకుండా, బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇటీవల ఏర్పాటు చేసిన ‘నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ జిల్లా భద్రతా చరిత్రలో ఒక విప్లవాత్మక నిర్ణయం. పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసుల మధ్య సమన్వయం పెంచి ఒక భద్రతా వలయాన్ని సృష్టించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. నగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీకి శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారం చూపారు.

వన్ వే నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో తీసుకున్న నిర్ణయాలు వాహనదారులకు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చాయి. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లో భాగంగా, బాధితుల సమస్యలను నేరుగా విని, వాటి పరిష్కారం అయ్యే వరకు స్వయంగా పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి అధికారులతో నేరుగా మాట్లాడుతూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడటం ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని రెట్టింపు చేసింది.

మొత్తానికి, సీపీగా బాధ్యతలు చేపట్టిన ఈ ఏడాది కాలంలో నిజామాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం సరికొత్త ఉత్తేజంతో కనిపిస్తోంది. శాంతికి మారుపేరుగా, నేరగాళ్లకు సింహస్వప్నంగా మారిన ఆయన పాలన పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments