జిల్లాలో మొరం అక్రమ రవాణాదారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. నిబంధనలు తుంగలో తొక్కి, అనుమతులు లేకుండా వాగులను తవ్వేస్తున్న మైనింగ్ మాఫియాపై ‘చీత ఫోర్స్’ గర్జించింది. సోమవారం ధర్పల్లి మండలం మైలారం గ్రామ పరిధిలోని పెద్ద వాగులో సాగుతున్న అక్రమ తవ్వకాలపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి భారీగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లావ్యాప్తంగా అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు.
ఈ క్రమంలోనే మైలారం వాగులో అక్రమంగా మొరం తవ్వుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో, సీసీఎస్ ఏసీపీ (ఇన్చార్జ్) మస్తాన్ అలీ నేతృత్వంలో చీత ఫోర్స్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
పోలీసుల రాకను ఏమాత్రం పసిగట్టలేని తవ్వకందారులు, యథేచ్ఛగా సాగిస్తున్న అక్రమ దందాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అడ్డుకున్నారు. ఘటనా స్థలంలో తవ్వకాలు జరుపుతున్న 2 జేసీబీలు, మొరం లోడ్‌తో ఉన్న 13 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం ధర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ.కు అప్పగించారు.
నిందితులపై మైనింగ్ చట్టాల ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సహజ వనరులను కొల్లగొట్టడమే కాకుండా, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న ఇలాంటి అక్రమ కార్యకలాపాలను సహించేది లేదని అధికారులు హెచ్చరించారు.
వాగులు, చెరువుల వద్ద తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఎక్కడైనా అక్రమ రవాణా జరిగితే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
