మారుతున్న జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణకు ఆయుర్వేదం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ అన్నారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ముబారక్నగర్లో నిర్వహించిన మెగా ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ధన్వంతరి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శిబిరంలో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కలు, చిరుధాన్యాల ప్రదర్శనను తిలకించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. దినచర్య, రుతుచర్యలో భాగంగా యోగాసనాలను అలవాటుగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ గంగాదాస్ మాట్లాడుతూ 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల విషయంలో ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముబారక్నగర్లో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాము, మాజీ సర్పంచ్ హన్మాండ్లు, హోమియో వైద్యురాలు డాక్టర్ శ్రీవాణి, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వెంకటేష్, జయప్రకాష్, ప్రత్యూష, ఆయుష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, ఉమాప్రసాద్, నీరజ, సంధ్య, మురళి, ఆయుష్ సిబ్బంది రమేష్, బిక్షపతి, సురేందర్, మహేష్, మజీద్తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.
