ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సూచించారు.
రానున్న రోజుల్లో తాగు, సాగునీటి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి యోగితా రాణా సమక్షంలో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయనే అంచనాల మధ్య భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయికి పడిపోవడం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్షీణించడం అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటివరకు జిల్లాలో కేవలం 59 శాతం మేరకే సాగు పూర్తైంది.
వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల క్షీణత, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ, హార్టికల్చర్, విద్యుత్ తదితర శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పరిస్థితులను వివరించారు.
రైతుల నుంచి కూడా సూచనలు, అభిప్రాయాలు స్వీకరించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. “రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది” అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు.
వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పించి పరిస్థితులకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్,హార్టికల్చర్ వంటి పంటల ఎంపికలో మార్గనిర్దేశం చేయాలని ఆదేశించారు.
రైతులు సమావేశంలో ప్రస్తావించిన ప్రత్యేక పంటలకు అవసరమైన విత్తనాల అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సీడ్స్ అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని చెప్పారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేసి, సాధ్యమైన మేరకు పరిష్కారాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
జిల్లాలో భూగర్భ జలాలు ఆందోళనకరంగా పడిపోవడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం తాగునీటికి సుమారు 30 రోజులకే సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. నిజాంసాగర్‌లో నాలుగు టీఎంసీల నీరు కూడా లేని పరిస్థితి నెలకొందని తెలిపారు.
ఈసారి ప్రాజెక్టులను నింపే స్థాయిలో వర్షాలు లేకపోవచ్చనే అంచనాలతో ముందస్తు చర్యలు అవసరమని పేర్కొన్నారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ 5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 10 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉండటంతో రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చని వివరించారు.
ఈ సందర్భంగా రాజకీయ అంశాలనూ ప్రస్తావించిన సుదర్శన్‌రెడ్డి.. కొందరు నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. నీటి లభ్యత, నదుల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టులు నిర్మిస్తే ప్రజలకు ప్రయోజనం ఉండదని అన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అలీ సాగర్ వంటి ప్రాజెక్టులు దీర్ఘకాల ప్రయోజనం అందించేలా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి..టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే గణనీయంగా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పరిస్థితి పెద్ద విపత్తు కాకపోయినా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తోందన్నారు.
ఈ ఏడాది జిల్లాలో సాధారణం కంటే 45 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు వివరించారని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పించి పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ముందస్తు చర్యలను వేగంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, నిజామాబాద్ జిల్లాలోనూ ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మార్కెట్‌లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులు పాడి పరిశ్రమ వైపు కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఇందుకోసం కమిటీ పనిచేస్తోందని చెప్పారు.
ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమైన చర్యలపై ప్రభుత్వంతో చర్చించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు సుమారు 20 రోజుల తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయని అధికారులు వివరించారని తెలిపారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి యోగితా రాణా, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
