బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికల హామీలను విస్మరించి రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
ఎమ్మెల్యే ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చలో అంకాపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాకేష్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలతో రాజకీయ సంస్కృతిని దిగజారుస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో రూపాయికే వైద్యం, ప్రతి గ్రామంలో పేదలకు పది ఉచిత ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తుంటే వాటిని జీర్ణించుకోలేక బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను అన్ని గ్రామాల విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అంకాపూర్ వైపు తరలించారని ఆరోపించారు. దీనివల్ల వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలతో కాలం గడుపుతున్నారని, రోజురోజుకూ ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు.ఇకపై కూడా ఇదే తరహాలో వ్యక్తిగత, అభ్యంతరకర వ్యాఖ్యలు కొనసాగిస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
