తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. దేశ చరిత్రలో ఏ చట్టసభలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు.
తాత మధును వెంటనే శాసనమండలి సభ్యత్వం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, ప్రతిపక్షాలకు కనీస గౌరవం ఇవ్వలేదని గడుగు గంగాధర్ విమర్శించారు.
ప్రజా సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు కూడా అప్పటి ప్రభుత్వం సమయం ఇవ్వలేదన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న సంపత్‌కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను సస్పెండ్ చేసిన విషయాన్ని బీఆర్‌ఎస్ నేతలు మరిచిపోయారా అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతోనే 2023 ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని అన్నారు. గత రెండున్నరేళ్లలో ప్రజా సమస్యలపై సచివాలయానికి వెళ్లి సంబంధిత మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చిన దాఖలాలు బీఆర్‌ఎస్ నేతలకు లేవని పేర్కొన్నారు.శాసనసభను సమావేశపర్చాలని డిమాండ్ చేసిన బీఆర్‌ఎస్ నేతలు.. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడం సరైన పద్ధతి కాదన్నారు.
సభలో స్పీకర్ పలుమార్లు విషయానికి పరిమితమై ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించినా పట్టించుకోకుండా వ్యవహరించడం దురుద్దేశపూరితమని గడుగు గంగాధర్ పేర్కొన్నారు. శాసనసభ, శాసనమండలిలో బీఆర్‌ఎస్ నేతల వ్యవహారశైలి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు.
