నగర యువత ను మత్తులో ముంచెత్తిన గంజాయి దందా ఇప్పుడు పల్లెలకు పాకింది.పచ్చని పంట పొలాలతో వికసిల్లె గ్రామాల్లో మత్తు దందా చాప కింద నీరులా విస్తరించడం ఫై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.మొన్నటి దాక పట్టణ ప్రాంతాల్లోనే గంజాయి అమ్మకాలు అక్రమ రవాణాల మీద ఉక్కుపాదం మోపుతూ వస్తున్న పోలీసులు ఇప్పడు గ్రామీణ ప్రాంతాల్లో ను గంజాయి చెలామణి డేగ కన్ను వేయాల్సిన పరిస్థితి వచ్చేసింది.
చితా ఫోర్స్ మెరుపు దాడి తో రుద్రూర్ లో గంజాయి చెలామణి వెలుగులోకి వచ్చింది.పాడి పంటలకు కేరాఫ్ గా ఉండే రుద్రూర్ లో ఓ రైస్ మిల్ కేంద్రంగా గంజాయి అమ్మకాలు వెలుగు వచ్చాయి.
గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న సమాచారంతో సీసీఎస్ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో సుమారు 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.మహారాష్ట్ర ప్రాంతం సరిహద్దులోని ఉండడంతో అక్కడి నుంచి ఎండు గంజాయి ని ఫ్యాకెట్ ల రూపం లో తెచ్చి రుద్రూర్ పరిసరాల్లో ఉన్న రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీలకు గంజాయి విక్రయిస్తున్నారు. నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ లాంటి పట్టణ ప్రాంతాల్లో గంజాయి చెలామణి దశాబ్దాలుగా సాగుతుంది గతంలో సాగు తో పాటు రవాణా సాగే గ్రామీణ ప్రాంతాల్లో చెలామణి ఉండేది కాదు కానీ సాగు …రవాణా లపై ఉక్కుపాదం పడడం తో అదుపులోకి వచ్చేసింది.
కానీ గత పదేళ్లుగా ఆర్మూర్ ఏరియా లో బీమ్ గల్ మోర్తాడ్ కమ్మర్ పల్లి మెండోరా ముప్కాల్ వేల్పూర్ లాంటి ప్రాంతాల్లోకి గంజాయి అమ్మకాలు మొదలయ్యాయి ముఖ్యంగా యువత ను టార్గెట్ గా చేసుకొని గంజాయి అమ్మకాలు సాగేవి ఈ పంట సాగు కు ఎంతో ఖ్యాతి గాంచిన ఈ ప్రాంతాల్లో మత్తు మహమ్మారి ఆనతి కాలంలోనే ప్రబలింది.
ఈ ప్రాంతాల్లో గంజాయి దందా నియంత్రించడానికి కఠిన కార్యచరణ అమలు చేస్తున్నారు కానీ ఇప్పడు రుద్రూర్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు వెలుగులోకి రావడంతో పోలీసులే కాదు ఆబ్కారీ అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు
ఆందోళనలో తల్లిదండ్రులు… చిద్రమవుతున్న జీవితాలు
”చదువుకుని ప్రయోజకులై తమను ఆదుకుంటార”ని కలలు కనే తల్లిదండ్రులకు ఈ గంజాయి ఘాటు కన్నీటిని మిగులుస్తోంది. చిన్న వయసులోనే మత్తుకు బానిసవుతున్న యువత, క్షణికావేశంలో నేరాల బాట పడుతోంది.
ఒక్కసారి గంజాయికి అలవాటు పడిన యువత మానసికంగా, శారీరకంగా కుంగిపోయి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పల్లెల్లో ఈ సంస్కృతి పెరుగుతుండటంతో కన్న తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు తలచుకుని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో గంజాయి మూలాలను తుదముట్టించేందుకు అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
