ఒకపక్క ఎండలు,తీవ్రమైన ఉక్కపోత, మరోపక్క వరుసగా కురుస్తున్న వర్షాలు వెరసి వాతావరణంలో అనూహ్య మార్పులతో జిల్లాను వైరల్ వ్యాధులు వణికిస్తున్నాయి. ప్రతిరోజు వందలాది మంది వైరల్ జ్వరాల బారిన పడి అవస్థలు పడుతున్నారు. మెడికల్ కాలేజికి అనుబంధంగా ఉన్న జిజిహెచ్ కు రోగుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. సాధారణ రోజుల్లో సుమారు 1000 నుంచి 1500 మంది రోగులు వస్తుండేవారు.
కానీ ఇప్పుడు రోగులు రెండింతల అయ్యారు. అవుట్ పేషెంట్ విభాగంలో పెరుగుతున్న రోగులకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆస్పత్రి అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.గత రెండు నెలల నుంచి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, డయే రియా లాంటి విష జ్వరాల పీడితుల సంఖ్య పెరుగుతుం డటంతో రోజురోజుకు జిల్లా ప్రజలు హడలెత్తిపోతు న్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో జ్వర బాధితులతో కిటకిటలాడుతు న్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి దోమలు విజృం భిస్తున్నాయి. దోమకాటు, వైరల్ పీవర్, విష జ్వరాలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబి క్కిరి అవుతున్నారు. వర్షాలు పడుతున్నాయన్న సంబరం కంటే జ్వరాలు సోకు తున్నాయనే ఆందోళనే ప్రజల్లో ఎక్కువగా కనబడుతోంది. జిల్లాలో దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు.
ప్రధానంగా చిన్నారులు ఎక్కు వగా డయేరియాలకు గురవుతున్నారని తెలిపారు.సీజన్ చివర్లో వైరల్ వ్యాధుల బెడద మొదలు కావడంతో ఆస్పత్రి యంత్రాంగం అప్రమత్తమైంది. అందుకోసం జ్వర బాధితులకోసం పిల్లలకు,పెద్దవారికి వేరువేరుగా ప్రత్యేక వార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
నిత్యం నిజామాబాద్ జీజీహెచ్లో 2500కు పైగా ఓపి నమోదు అవుతుం డగా, అందులో చాలా వరకు జ్వర బాధితులే ఉంటున్నారని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. రెండు నెలలుగా పేషెంట్లు జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి రాగా, అక్కడ వైద్యులు 3500 మందికి పరీక్షలు నిర్వహించి 150 మందికి పైగా డెంగీ,డయేరియా, ఏఆర్ఐ, టైఫాయిడ్ జ్వరాల బారిన పడినట్లు నిర్ధారించారు.
గత సంవత్సరం తో పోల్చుకుంటే ఈ ఏడాది డెంగ్యూ కేసులు కొంత మేరకు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల వివరాలు నమోదు అవుతు న్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల వివరాలు ప్రభుత్వ లెక్కలకు అందడం లేదు. జిల్లాలో ఏ ప్రైవేట్ ఆసుపత్రి చూసినా రోగులు పెద్ద సంఖ్యలో కనబడుతున్నారు.
ఇదే అదునుగా కొందరు ప్రైవేట్ యాజమాన్యాలు అందినకాడికి దోచుకుంటున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు, తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుత్రులకు వెళ్తూ వేల రూపాయలు ఫీజులు కడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
డెంగ్యూ ప్లేట్ లెట్లు ఎందుకు తగ్గిపోతాయి ?
ఏడీస్ దోమకుట్టినప్పుడు డెంగ్యూ వైరస్ రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ మొదటగా ప్లేట్లెట్లపై దాడి చేస్తుంది. ఈరకంగా దాడికి గురైన ప్లేట్లెట్లు ఇతర ఆరోగ్యకరమైన ప్లేట్లెట్లను నాశనం చేస్తాయి. దీనివల్ల శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అందుకు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లేట్లె ట్లలను ఇవ్వడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని జీజీహెచ్ సూపరిం టెండెంట్ తెలిపారు.
డెంగ్యూ జ్వరం లక్షణాలు :
ఆకస్మిక అధిక జ్వరం (105 డిగ్రీలు) తీవ్రమైన తలనొప్పి, కళ్ళు వెనుక నొప్పి, తీవ్రమైన కండరాల నొప్పి, అలసట, వికారం, వాంతులు, అతిసారం, చర్మంపై దద్దుర్లు, ఇది జ్వరం ప్రారంభమైన రెండు నుండి ఐదు రోజుల తర్వాత కనిపి స్తుంది. తేలిక పాటి రక్తస్రావం.
అతిసార వ్యాధి :
మామూలుగా వైరస్ వల్ల వస్తుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా వైరస్ వల్ల వస్తుది. వాంతులు, విరేచనాలు, తక్కువ ఉష్ణో గ్రతతో జ్వరం డీసెంట్రి ఐతే రక్త విరేచనాలు, వికారంగా ఉండడం, అన్నహితం లేకపోవడం, మామూలుగా ఈ జబ్బు 2-3 రోజులలో తగ్గిపోతుంది. పిల్లల్లో అతిసారం సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల లోపల తగ్గిపోతుంది. లేదంటే రెండు వారాల వరకు ఉంటుంది. పెద్ద వారిలో సాధారణంగా రెండు నుండి నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది.
వెంటనే వైద్యులను సంప్రదించాలి :
జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ …
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో విష జ్వరాలతో రోగుల తాకిడి పెరిగింది.అందుకే ప్రత్యేక వార్డు లను ఏర్పాటు చేసి, జ్వరంతో వచ్చే బాధితులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నాము. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాధుల నివారణకు విస్తృత చర్యలు చేపడు తున్నాం. విష జ్వరాల విషయంలో ప్రజలు భయాందోళన చెందవద్దు, డెంగ్యూ, టైఫాయిడ్ లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తు న్నాము. పాజిటివ్ నమోదైన వారికి చికిత్స అందిస్తున్నాము. వ్యాధుల పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
