మాతృత్వం మంట కలుస్తుంది. మానవత్వానికి మాయని మచ్చ మిగులుతుంది. ఓ కన్నతల్లి తన కడుపున పుట్టిన బిడ్డను అంగట్లో సరుకును అమ్మినట్లు అమ్మడం కలకలం రేపుతుంది. భార్యాభర్తల బంధంలో వచ్చే కలతలు, కుటుంబంలో నెలకొన్న పేదరికం, మాతృత్వం దొరకని తల్లిదండ్రులు.. ఈ ఉదంతాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆర్మూర్ పట్టణంలో దంపతుల మధ్యలో ఉన్న కలహాలతో మమకారాన్ని చంపుకొని ఓ కన్నబిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటన కలకలం రేపుతుంది. ముక్కుపచ్చలారని ఏడు నెలల పసికందు అమ్మకం ఆర్మూర్ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. నందిపేట మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన అంగిలేటి లక్ష్మి పోశెట్టి దంపతులు గత వారం క్రితం పెర్కిట్ కు చెందిన మహమ్మద్ గౌస్ ,హబీబీలకు అమ్మినారు. రషీద, మహమ్మద్ అనే దంపతులకు పిల్లలు లేకపోవడంతో వారికోసం పసికందును విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలియనప్పటికీ, ఈ ఘటన కు పాల్పడిన సదరు తల్లిదండ్రులు మానవత్వానికి మాయని మచ్చలు మిగులుస్తున్నారని మానవతావాదులు అంటున్నారు. రహస్యంగా జరిగిన ఈ పసికందు అమ్మకం కాస్త రచ్చకు రావడంతో ఆర్మూర్ పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేశారు. అనంతరం ఆ ఏడు నెలల పసికందునునిజామాబాద్ పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఉన్న బాలల కేంద్రంలో ఐసిడిఎస్ అధికారుల సంరక్షణలో అప్పజెప్పారు. ఏది ఏమైనా సమాజంలో జరుగుతున్న ఇటువంటి అవమానం అమానవీయ ఘటనలు పునరావృతం కాకూడదంటే మాతృత్వానికి మచ్చ తెచ్చే తల్లిదండ్రులు తమ మనసు మార్చుకోవాలని మానవతావాదులు అంటున్నారు.
