- మోగనున్న పంచాయతీ ఎన్నికల నగారా
- అక్టోబర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు
- గత ఆరు నెలలుగా గ్రామాల్లో స్పెషల్ పాలన
స్థానిక ఎన్నికల సమరానికి సర్కార్ సమాయత్తమవుతుంది. రానున్న అక్టోబర్ నెలలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
రుణమాఫీ రైతుల ఖాతాలో పడుతున్న నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికలకు సమయం కలిసి వస్తుందన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
గ్రామస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలలో పై ‘చేయి’ సాధించి పట్టు నిలుపుకోవడానికి అడుగులు వేస్తోంది.
పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే నిజామాబాద్ జిల్లాలో జిల్లాలోని 590 గ్రామాలకు గాను 530 గ్రామపంచాయతీలకు నూతన పాలకవర్గాలు ఏర్పడనున్నాయి.
ఈ ఏడాది జనవరి 31తో గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నుండి ప్రత్యేక అధికారులను నియమించి పంచాయతీల పాలనను కొనసాగిస్తుంది.
ఆరు నెలల గడువు దాటితే కేంద్రం నుండి పంచాయతీలకు వచ్చే నిధులు ఆగిపోయే పరిస్థితి ఉండడంతో ఎన్నికలను త్వరగా ముగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కులగణనను పూర్తిచేసిన అనంతరం.. గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. కుల గణన చేసేందుకు నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో కులగణన చేపట్టకుండానే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 8నెలలు అయ్యింది. అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం తాజాగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఈ అంశం తమకు అనుకూలిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామపంచాయతీ ఎన్నికలను త్వరలో జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్న ప్రచారం జరుగుతుండడంతో గ్రామాలలో ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్న ఆశావాహులు తమ భవిష్యత్తు కార్యచరణకు ప్రణాళికలు వేసుకుంటున్నారు.
జిల్లాలోని అనేక గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ధి కుంటుపడింది అని అపవాదు ఉంది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే నూతనంగా ఏర్పడే పాలకవర్గంతో అభివృద్ధి జరుగుతుందని ఆశాభావంతో ప్రజలు కూడా ఆసక్తితో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.