భక్తుల కోలాహలం కేరింతల మధ్య జరిగే ప్రతియేటా హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే హన్మాన్ జయంతి శోభాయాత్ర ఈసారి మరింత ఉత్సహంగా సాగింది. కానీ ఈసారి లోకసభ ఎన్నికల నీడలు పడ్డాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఈసారి సందడి చేసారు. తాము హిందూబావజాలం ఉన్నవాళ్ళమే అని చెప్పుకోవడానికి ఈ శోభాయాత్ర ను ఓ వేదికగా చేసుకున్నారు.నిజానికి ప్రతియేటా జరిగే ఈ శోభాయాత్రలో నేతల హడావుడి ఉండేది కాదు. నేతలు హన్మాన్ జయంతి నాడు సమీప గుడిలో దైవదర్శనం చేసుకొని కొద్దీ సేపు కనిపించి వెళ్ళేది.
కానీ ఈసారి లోకసభ ఎన్నికలుండడంతో ఎలాగో వోట్ల కోసం చెప్పులరిగేలా ప్రచారంలో తిరుగుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నేతలు ఈ రోజు రోజంతా ఇదే కార్యక్రమానికి కేటాయించారు. విశ్వహిందూ బజరంగ్ దళ్ లాంటి హిందూ ధార్మికసంస్థల నిర్వహణలో ఈ శోభాయాత్ర సాగుతున్న నేపథ్యంలో బీజేపీ మినహా మిగితా పార్టీల నేతలు ఎదో మొక్కుబడిగా హాజరు అయి వెళ్ళేది.
కానీ సార్వత్రిక ఎన్నికల తరుణంలో నేతలు అనివార్యంగా ఈ శోభాయాత్ర లో ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. ఆయా ధార్మిక సంఘాలు పది రోజుల ముందు నుంచే శోభాయాత్ర ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న హన్మాన్ భక్తులను సమీకరిస్తారు. సహజంగానే ఈ సంఘాల బీజేపీ ముఖ్య నాయకులనే ఆహ్వానిస్తూ వస్తున్నారు. వారుకూడా శోభాయాత్ర మొదలైన కొద్దిసేపు హడావుడి చేసి వెళ్ళేది.
ఆ తర్వాత వేలాది మంది యువకులు అలుపు సొలుపు లేకుండా రాత్రి పదింటి దాక ఈ యాత్ర జరిపేది. అసలు ఎవరు లీడ్ చేస్తుంది ఎవ్వరికి అర్థం అయ్యేది కాదు. కానీ వేలాది మంది ఒక్కసారి జిల్లాకేంద్రంలో కదం తొక్కే ఉత్సవం కావడంతో పోలీసు శాఖ వందలాది మంది తో బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. కానీ ఈసారి శోభాయాత్ర కు భద్రతా మరింత కట్టుదిట్టం చేసారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి బిఆర్ యస్ అభ్యర్థి గోవర్ధన్ లతో పాటు బీజేపీ అభ్యర్థి అర్వింద్ సైతం హాజరు అవుతుండడంతో పోలీసు శాఖ ముందే అలర్ట్ అయింది.
కాంగ్రెస్ నేతల హడావుడి ఎక్కువగా కనిపించింది. గతంలో శోభాయాత్ర వైపు కన్నెత్తి చూడని హస్తం నేతలు ఈసారి కాషాయ తలపాగా లతో అందరికన్న ఎక్కువ సందడి చేసారు. తామేమి తక్కువ అనుకున్నారో ఏమో బిఆర్ యస్ నేతలు గులాబీ కండువా పక్కుకు పెట్టేసి కాషాయ కండువా లతో శోభాయాత్ర లో క్రియాశీలకంగా వ్యవహరించారు. జెడ్పి ఆఫీస్ వద్ద శోభాయాత్ర లో పాల్గొన్న యువకులకు మజ్జిగ పంపిణీ చేసారు.శోభాయాత్రలో బీజేపీ శ్రేణులు ఆధిపత్యం కోసం తాపత్రయ పడ్డాయి.