రేపటి రోజున చెట్లు విరిసి, పచ్చని వనాలుగా గ్రామ పొలిమేరలు తయారయ్యేలా సీడ్ బాల్స్ ను సిర్పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థుల చేత తయారు చేయించి చల్లడం జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు శ్యామల ,మోహన్ తెలిపారు.
మంగళవారం నాడు పాఠశాలలో 8వ తరగతి విద్యార్థుల చేత మట్టిని తెప్పించి దానిలో వేప ,చింత ,సీతాఫల, సపోటా ,జామ ,వేప మొదలైన విత్తనాలను వాటిలో చేర్చినారు.
ఆ తయారైన విత్తనాల మట్టి గడ్డలను రెండు రోజులు ఆరనిచ్చి ,శుక్రవారం నాడు సిర్పూర్ గ్రామ పొలిమేరలోని ఖాళీ ప్రదేశాల్లో విద్యార్థులను తీసుకెళ్లి అక్కడ ఈ సీడ్ బాల్స్ ను చల్లేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకున్నారు.
ఈ కార్యక్రమం గురించి ఉపాధ్యాయులు శ్యామల, మోహన్ మాట్లాడుతూ పచ్చదనం పెంచడానికి గ్రామ శివారులు హరితవనాలుగా మారడానికి ఈ సీడ్ బాల్స్ ఎంతో ఉపయోగపడుతాయన్నారు.
పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు పచ్చదనం మీద మొక్కల పెంపకం మీద అవగాహన కలిగి భవిష్యత్తులో వారు వనాలు పెంచడానికి చిన్నారి మనసుల్లో కంకణం కట్టుకునేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు.
సీడ్ బాల్స్ చల్లడం వంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులు వి. సత్యనారాయణ అభినందించారు.
