HomeCRIME‘స్కై బార్’ సిబ్బంది వీరంగం..మద్యం అడిగినందుకు యువకుడి ముక్కు ఎముకలు పగలగొట్టిన నిర్వాహకులు

‘స్కై బార్’ సిబ్బంది వీరంగం..మద్యం అడిగినందుకు యువకుడి ముక్కు ఎముకలు పగలగొట్టిన నిర్వాహకులు

నగరంలోని వినాయక్‌నగర్ సమీపంలో ఉన్న ‘స్కై బార్’ అరాచకాలకు అడ్డాగా మారుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ధీమాతో.. ఇక్కడి నిర్వాహకులు, సిబ్బంది సామాన్య కస్టమర్లపై గూండాల మాదిరిగా విరుచుకుపడుతున్నారు.

“మా వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారు.. మేము ఏం చేసినా నడుస్తుంది.. మా వైపు ఎవరూ కన్నెత్తి చూడలేరు” అనే అహంకారంతో గత కొద్దిరోజులుగా బార్‌కు వచ్చే కస్టమర్లతో తీవ్ర దురుసుగా ప్రవర్తిస్తూ, దాడులకు తెగబడుతున్నారు.

తాజాగా ఆదివారం రాత్రి మద్యం కోసం వచ్చిన ఓ యువకుడిని చావబాది ముక్కు ఎముకలు పగలగొట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. సందీప్ అనే యువకుడు ఆదివారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో వినాయక్‌నగర్ స్కై బార్‌కు మద్యం కొనుగోలు కోసం వెళ్లాడు. అయితే అక్కడ కౌంటర్ వద్ద సుమారు 20 నిమిషాల పాటు వేచి ఉన్నా సిబ్బంది పట్టించుకోకపోవడంతో.. త్వరగా మద్యం ఇవ్వాలని సందీప్ నిర్వాహకులను ప్రశ్నించాడు.

అంతే.. కస్టమర్ అడుగుతాడా అనే అహంకారంతో అక్కడ పనిచేస్తున్న ప్రధాన నిర్వాహకుడు శుశాంత్‌తో పాటు మిగతా సిబ్బంది ఒక్కసారిగా సందీప్‌పై విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా పిడిగుద్దుల వర్షం కురిపించారు.

బార్ సిబ్బంది అంతా గుంపుగా చేరి చేసిన ఈ దాడిలో బాధితుడు సందీప్ ముక్కు ఎముకలు దారుణంగా పగిలిపోయాయి. సిబ్బంది దాడితో ముక్కు నుంచి రక్తం కారుతున్నా కించిత్ కూడా జాలి లేకుండా సందీప్‌ను బార్ నుంచి బయటకు నెట్టేశారు.

ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు రక్తం ఓడుతున్న స్థితిలోనే నేరుగా నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తనపై దాడి చేసిన నిర్వాహకుడు శుశాంత్, ఇతర సిబ్బందిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

అనంతరం తీవ్ర గాయాలపాలైన బాధితుడు సందీప్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఈ ‘స్కై బార్’లో కస్టమర్లపై దాడులు జరగడం ఇదే ప్రథమం కాదు. గతంలోనూ ఇక్కడ మద్యం సేవించేందుకు వచ్చిన పలువురిపై సిబ్బంది దౌర్జన్యానికి దిగిన ఉదంతాలు ఉన్నాయి.

బార్‌కు వచ్చే కస్టమర్లతో నిర్వాహకులు నిత్యం దురుసుగా ప్రవర్తిస్తూ, గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రతిసారీ అధికార పార్టీకి చెందిన పెద్దల ఒత్తిళ్లతోనే ఈ వ్యవహారాలు సర్దుమణిగుతున్నాయని, అందుకే వీరు ఇంతలా రెచ్చిపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

‘స్కై బార్’ నిర్వాహకులపై నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ అరాచక కేంద్రంపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments