ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన వైఖరిని మార్చుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ హితవు పలికారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత పాలకులను విమర్శించడం కంటే నిజామాబాద్ అభివృద్ధికి ఏం చేశారో అరవింద్ సమాధానం చెప్పాలని రాంభూపాల్ డిమాండ్ చేశారు. నిజాం సర్కార్ వల్లే అభివృద్ధి జరగలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఏడేళ్లుగా ఎంపీగా ఉండి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు.
గత మున్సిపల్ ఎన్నికల సమయంలో నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా మారుస్తామన్న హామీ నెరవేర్చడంలో ఎంపీ విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఖేలో ఇండియా ద్వారా క్రీడా మైదానాలకు నిధులు తేవడంలో కానీ, ముద్ర లోన్ల ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
నగరంలో వర్షం పడితే మోకాళ్ల లోతు నీళ్లు వస్తున్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకురాలేదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే బీజేపీకి నిజామాబాద్‌పై ప్రేమ పుట్టుకొస్తుందని విమర్శించారు. తన లెటర్ హెడ్, విజిటింగ్ కార్డులపై నిజామాబాద్ అని వాడుకుంటూ, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇప్పుడు ‘ఇందూరు’ పేరును తెరపైకి తెచ్చి భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ హయాంలో వచ్చిన ఈ పథకం పేరు మార్చి, నిధుల భారాన్ని రాష్ట్రాలపై నెట్టడం దుర్మార్గమన్నారు. దీనిపై గ్రామ గ్రామాన నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.
అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం అరవింద్ స్థాయికి తగదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారనీ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ధర్మ గౌడ్, పత్తి శోభన్, రాజ్ గగన్, అసద్, దత్రిక భాస్కర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
