బస్సులు ఇష్టారాజ్యం నడుపుతున్నారంటూ విద్యార్థులు బస్సులను నిలిపేసి రోడెక్కారు.గ్రామానికి వచ్చే రెండు ఆర్టీసీ బస్సులను గ్రామస్తులు, విద్యార్థులు అడ్డుకుని నిలిపివేశారు. బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి లో జరిగింది. బస్సులను ఇదివరకు ఉన్న రూట్ లోనే నడపాలని డిమాండ్ చేసారు .
గతంలో పెద్ద మల్లారెడ్డి బస్సు నేరుగా బిక్కనూర్, పెద్ద మల్లారెడ్డి మధ్య నడిచేది. అయితే ఇటీవల ఆర్టీసీ అధికారులు ఈ బస్సు రూట్ ను మార్చి గొట్టిముక్కుల, క్యాసంపల్లి, చింతమానిపల్లి గ్రామాల మీదుగా తిప్పుతున్నారు.
దీంతో ప్రయాణ దూరం, సమయం రెండూ భారీగా పెరిగాయి. దీని వల్ల ఉదయం పూట పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే కూలీ పనులకు, ఆసుపత్రులకు వెళ్లే వారికి కూడా ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ఇదే సమస్యపై గ్రామస్తులు ధర్నా చేసి బస్సులు యథావిధిగా నడవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ రూట్ మార్చడంతో ఆగ్రహించిన విద్యార్థులు, గ్రామ పెద్దలతో కల్సి రెండు బస్సులను గ్రామంలోనే నిలిపివేశారు.
