పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగం పెంచాలి..
మహిళలకు భరోసా కల్పించాలని ఆదేశం
7మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు.
నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కారం, స్టేషన్ రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదగా, గౌరవంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.
ముఖ్యంగా మహిళలు, బాలికలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. ప్రతి ఫిర్యాదును ఓర్పుగా విని, చట్టపరమైన పరిష్కారం చూపాలని తెలిపారు. మహిళలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యానికి తావులేకుండా, అవసరమైన ఆధారాలను సేకరించి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు.
పెండింగ్ కేసుల వివరాలు, కేసు ఫైళ్లు, వివిధ రికార్డులను పరిశీలించిన సీపీ.. దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
మహిళల భద్రత, రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, సమస్యలు ఎదురైతే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు.పోలీసు అధికారులు, సిబ్బంది 24 గంటలూ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సీపీ సూచించారు. దూర ప్రాంతాలకు అవసరంలేని ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ప్రతి పోలీసు ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెంచేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అన్నారు.తనిఖీ సందర్భంగా తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీపీ.. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. ఏసీపీ ప్రకాష్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీలత, ఎస్ఐలు ఎం.డి.రహమతుల్లా, పి.రాజేశ్వర్, పి.జాన్సన్, సిబ్బంది పాల్గొన్నారు.
