మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మండిపడ్డారు.
పథకం పేరు మార్చి, నిధుల కేటాయింపులో కోతలు విధిస్తూ గ్రామీణ పేదల పొట్ట కొడుతున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2004లో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు తాళాలు వేసి ప్రజలు వలస వెళ్తుండడాన్ని గమనించి ఈ చారిత్రాత్మక పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు.
మెదక్, అనంతపూర్ జిల్లాల్లో పర్యటించిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలు పేదలకు స్థానికంగానే పని కల్పించాలనే ఉద్దేశంతో ‘ఉపాధి హామీ’ని ప్రవేశపెట్టారన్నారు. గ్రామాల్లో సర్పంచులు, ప్రజలే గ్రామ సభల ద్వారా పనులను నిర్ణయించుకునే స్వేచ్ఛను కాంగ్రెస్ కల్పించిందని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించి, ‘జి-రామ్-జి’ అని పేరు మార్చిందని, ఇది గాంధీజీ ఆశయాలను అవమానించడమేనని విమర్శించారు. పని దినాలను 125 రోజులకు పెంచుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ, కేవలం 75 రోజులకు మాత్రమే కేంద్ర బడ్జెట్ కేటాయించిందని, మిగిలిన 50 రోజుల భారాన్ని రాష్ట్రాలపై వేయడం అన్యాయమని అన్నారు.
దీనిని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త మార్పులు కేవలం కార్పొరేట్ సంస్థలకు చౌకగా శ్రమను అందించే కుట్రలో భాగమేనని నగేష్ రెడ్డి ఆరోపించారు.
ఈనెల 20 నుండి 30వ తేదీ వరకు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తాం.125 రోజుల పని దినాల భారాన్ని కేంద్రమే భరించాలని ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేయాలని కోరారు.
2029లో రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ఈ పథకాన్ని పాత పద్ధతిలోనే పునరుద్ధరిస్తామని, అంతవరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
