కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర కావొస్తుంది. జిల్లాకు మంత్రి పదవీ ఇవ్వడానికి అధిష్టానం ఇంకా మీన మేషాలు లెక్కిస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత జిల్లాకు మంత్రి మండలి లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. పాలనా వ్యవస్థ ను అజమాయిషీ చేసే వారే లేకుండా పోయారు.
పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాలో మంత్రి లేక పోవడం ప్రగతి పనులకు ప్రతికూలంగా మారింది. గత అనుభవాలు సీఎం తో ఉన్న బంధుత్వ నేపథ్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడపా దడపా పాలనా వ్యవహారాలను పట్టించుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా జిల్లాలో ఇద్దరే ఎమ్మెల్యే లున్నారు ఆ ఇద్దరికి కూడా సఖ్యత వుండదు.
ఏకంగా నలుగురు కార్పొరేషన్ ఛైర్మెన్ లున్నారు. వారంతా పదవుల మజా లో ఉన్నారు అసలు క్షేత్ర స్థాయిలో పార్టీలో క్యాడర్ తో మమేకం అయ్యే నాధుడే లేకుండా పోయారు. జిల్లాకు మంత్రి వుంటే క్యాడర్ లో కొంతలో కొంత భరోసా దక్కుతుంది.
ఇప్పట్లో మంత్రి పదవి జిల్లాకు దక్కేలా లేదు. దీనితో ఇంచార్జ్ మంత్రే తురుపు ముక్కగా క్యాడర్ భావించారు. కానీ ఆయన జిల్లాకు చుట్టపు చూపు గా మారారు. ఆయన ఎక్కువగా హైదారాబాద్ కే పరిమితం ఎక్కువగా లేదంటే సొంత నియోజకవర్గం లో వుంటున్నారు.
జిల్లా నుంచి వెళ్లే కీలక నేతలకు సైతం ఆయన పూర్తీ స్థాయిలో సమయం ఇవ్వడం లేదు. నిజానికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసే విషయంలో యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడానికే ఇంచార్జ్ మంత్రులను నియమిస్తారు. అంతే కాదు.
కీలక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునే అధికారం కూడా ఇంచార్జ్ మంత్రులకే ఉంది. అధికారుల బదిలీ లు మొదలు ఇందిరమ్మ ఇండ్లు …రాజీవ్ యువ సంక్షేమ ….లాంటి పథకాల్లో ఇంచార్జి మంత్రి నిర్ణయమే కీలకం. అదీగాక ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యత కూడా వీరిదే.
ధాన్యం కొనుగోళ్లతో పాటు వాన కాల పంటల ప్రణాళిక లే కాదు వందల కోట్ల రూపాయలవ్యయం తో సాగుతున్న ప్రగతి పనుల పురోగతి ని సైతం ఇంచార్జ్ మంత్రే రివ్యూ చేయాలి అధికారులను పరుగులు పెట్టించాలి.
కానీ జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా నియామకం అయినా జూపల్లి కృష్ణారావు ఏడాదిన్నర కాలం నాలుగయిదు సర్లే వచ్చారు అదికూడా ఉరుకులు పరుగులుగా వచ్చి వెళ్లారు. కనీసం ఎమ్మెల్యే లు నియోజకవర్గ ఇంచార్జ్ లతో కూడా రివ్యూ చేయలేదు. ఈపాటికే ప్రజా క్షేత్రంలో ప్రభుత్వం పాలనా మీద ప్రతికూల భావన ప్రబలుతోంది.
ఎన్ని బృహత్తర పథకాలు అమలు చేస్తున్నా సరే ప్రజల్లో ఎందుకు సానుకూల దృక్పథం లేదని అధికార పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.రివ్యూ చేసే వారే లేకపోవడంతో పాలనా వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పింది.
అధికారులు ఎవరికి తోచింది వారు చేస్తూ వెళ్తున్నారు. సామాన్య ప్రజలు సంగతి దేవుడెరుగు పార్టీ నేతలకే ప్రభుత్వ ఆఫీస్ ల్లో పట్టించుకోవడం లేదు.
