కూలి డబ్బుల కోసం ఘర్షణ పడ్డ స్నేహితులు – మహేష్ అనే వ్యక్తి పై కత్తితో దాడి చేసిన ప్రశాంత్- మహేష్ కు తీవ్ర గాయాలు..
ఆస్పత్రికి తరలింపు – కేసు దర్యాప్తు చేస్తున్న ఆర్మూర్ పోలీసులు ఆ ఇద్దరు స్నేహితులు చట్టపట్టలేసుకొని కూలి పనులు ముగించుకొని మద్యం సేవించడానికి వైన్ షాప్ వద్దకు వచ్చారు.
మద్యం సేవించిన తర్వాత కూలి డబ్బులు విషయంలో ఇరువురికి వివాదం తలెత్తడంతో ఘర్షణ కాస్త కత్తిపోట్లకు దారితీసింది.
మరిన్ని వివరాలలోకి వెళ్తే…ఆర్మూర్ మున్సిపల్ లోని పెర్కిట్ -కోటార్ మూర్ చౌరస్తాలో సాయంత్రం జరిగిన కత్తిపోట్ల సంఘటన ఆర్మూర్ పట్టణంలో కలకలం రేపింది. .
ఆర్మూర్ పెర్కిట్ కు చెందిన బండి మహేష్, ఆకుల ప్రశాంత్ ల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువురు కలిసి మద్యం సేవించిన తర్వాత జరిగిన ఘర్షణలో ఇరువురిలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆకుల ప్రశాంత్ ఆయన వద్ద ఉన్న కత్తితో బండి మహేష్ పై దాడి చేయగా అతడు తీవ్ర గాయాల పాలయ్యాడు.
కత్తితో మహేష్ ను గాయపరిచిన ప్రశాంత్ అక్కడి నుంచి పరారు కాగా.. కత్తిపోట్ల సంఘటన సమాచారాన్ని అందుకున్న ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు.
బండి మహేష్ ను చికిత్స నిమిత్తం ఆర్మూర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
