జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి మూడు రోజుల క్రితం కిడ్నాప్ గురైన మూడేళ్ల బాలిక కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు ఒకటవ టౌన్ పోలీసులు కిడ్నాప్ కేసును 72 గంటల్లో చేధించారు.
ఈ మేరకు గురువారం ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసిపి రాజా వెంకటరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం నర్సాపూర్ గ్రామనికి చెందిన శిరీష ప్రస్తుత నివాసం నిజామాబాద్ నాగారంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
అయితే ఈ నెల 6 వ తేదీన బిక్షాటన నిమిత్తం తన యొక్క 8 నెలలు కుమారుడు దశరథ్ ను తీసుకొని, అలాగే మూడేళ్ల కూతురు రమ్యను కొండవ్వ వద్ద వదిలేసి భిక్షాటన గురించి వెళ్ళింది.
కొండవ్వ రమ్య ని పట్టుకొని గాంధీ చౌక్ వద్ద నిద్రిస్తున్న సమయంలో రాత్రి 8 గంటల సమయం లో గైక్వాడ్ బాలాజీ ఆ బాలిక ఒంటరిగా ఉన్నది గమనించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని తెలిపారు.తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు ప్రారంభించారు.
ఈ విచారణలో భాగంగా నిందితుడు గైక్వాడ్ బాలాజీ ఆ బాలికను తీసుకొని నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉమ్రీ తీసుకెళ్ళి అక్కడనుంచి స్వంత గ్రామం మద్నూర్ మండలంలోని మీర్జాపూర్ కు తీసుకెళ్లి సోదరుడైన గైక్వాడ్ సూర్యకాంతం కు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు గైక్వాడ్ సూర్యకాంతం సమయం దొరికినప్పుడు ఇట్టి బాలికను ఎవరికైనా అమ్మి డబ్బులు సంపాదించాలని దురుద్దేశం ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలిపారు.
ఈ మేరకు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నాలుగు టీమ్స్ ని ఏర్పాటు చేసి నిజామాబాద్ నందు ఉన్న దాదాపుగా 120 సీసీ కమెరాలను పరిశీలించి నిందితుడైన గైక్వాడ్ సూర్యకాంతం అదుపులోకి తీసుకుని బాలికను క్షేమంగా తల్లికి అప్పగించినట్లు పేర్కొన్నారు.
కిడ్నాప్ లో ప్రధాన నిందితుడు ఆయన గైక్వాడ్ బాలాజీ పరారీ లో ఉన్నట్లు తెలిపారు. బాలాజీ పై ఇదివరకు బోధన్ పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు,అలాగే బిచ్కుంద లో చోరి కేసులు ఉన్నాయని తెలిపారు.
ఈ చేదనలో నిజామాబాద్ ఒకటవ టౌన్ సీఐ రఘుపతి, ఏఎస్ఐ షకీల్,కానిస్టేబుల్ గంగారం,నితీష్,అనంత ప్రభు,వేణుగోపాల్, కార్బజీ లను అభినందించారు.
