HomeEditorial Specialపసుపు రైతుల కల... నెరవేరుతున్న వేళ - నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా...

పసుపు రైతుల కల… నెరవేరుతున్న వేళ – నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం – దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న పసుపు రైతులు – పట్టు వదలని విక్రమార్కుడిగా సాధించిన ఎంపీ అరవింద్ – బోర్డు ఏర్పాటు తో నెరవేరనున్న ప్రయోజనాలు

నిజామాబాద్ జిల్లా రైతుల 30 సంవత్సరాల చిరకాల స్వప్నం నిజం కాబోతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా నేడు పసుపు బోర్డు ప్రారంభించే అద్భుత సమయం ఆవిష్కృతం కానుంది.

ప్రపంచవ్యాప్తంగా జరిగే పసుపు ఉత్పత్తిలో భారతదేశం నుండి 70% ఉత్పత్తి జరుగుతుంది. ఈ రేషియో ప్రకారం మన దేశ రైతాంగంలో ఎక్కువ భాగం రైతులు పసుపు పంటను ప్రధానంగా సాగు చేస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. పసుపు పండించే రైతుకు ఇప్పటివరకు సరైన మద్దతు ధర లభించకపోవడంతో నిరాశే మిగులుతుంది. అయితే మనదేశంలో ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో పసుపు పంటను సాగు చేస్తున్నారు.

పసుపు పంట సాగు కోసం ఎకరాన 80 వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది. కష్టపడి పెట్టుబడీ పెట్టి పండించిన పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడంతో సుమారు 30 సంవత్సరాలుగా ఇందూరు రైతులు పసుపు బోర్డు కావాలని డిమాండ్ చేశారు.

జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాల్లో పసుపు పంటను సాగుచేస్తున్నారు. దేశంలో సాగు అయ్యే విస్తీర్ణంలో సుమారు 50% నిజామాబాద్ జిల్లాలోనే పండుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ప్రారంభించబోయే పసుపు బోర్డు ద్వారా పంటపై పరిశోధన చేసి రైతుకు సలహాలు, సూచనలు అందజేస్తారు. ఫలితంగా దిగుబడి పెరగడంతో పాటు పంటకు మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయని రైతులు భావిస్తున్నారు.

పసుపు బోర్డు ప్రారంభించడంతో కొత్త వంగడాలపై పరిశోధన చేసి తెగుళ్లను నివారించవచ్చని ఆశిస్తున్నారు రైతులు. అందుకే గత 30 ఏళ్లుగా పసుపు బోర్డు కోసం ఉద్యమ బాట పట్టారు. దీంతో పసుపు బోర్డుకు రాజకీయ రంగు పులుముకుంది.

2017లో అప్పటి నిజామాబాద్ ఏంటి కల్వకుంట్ల కవిత, ప్రధాని నరేంద్ర మోడీని కలిసి పసుపు బోర్డు అంశాన్ని లేవనెత్తారు. అయితే పసుపు బోర్డుకు బదులు పసుపు డెవలప్మెంట్ పార్క్ ను అప్పటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

ఈ తరుణంలో 2019 లోక్ సభ ఎన్నికలలో పసుపు బోర్డు అంశం ప్రధాన అస్త్రంగా మారింది. పసుపు బోర్డు ఏర్పాటుతోపాటు మద్దతు ధర ఇవ్వాలని రైతులంతా ఒక్కటై జేఏసీగా ఏర్పడి ఉద్యమించారు.

టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై 179 మంది పసుపు రైతులు నామినేషన్ వేసి చరిత్ర సృష్టించారు. ఇంకొంతమంది ఏకంగా ప్రధాని మోడీపై వారణాసిలో సైతం నామినేషన్ వేశారు. దీంతో ఈ అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే క్రమంలో లోక్ సభ బరిలో బిజెపి అభ్యర్థిగా నిలిచిన ధర్మపురి అరవింద్ రైతులకు పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చారు.

దీంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను ఓడించి, ధర్మపురి అరవింద్ మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. అంతే కాకుండా 2021 మార్చిలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి సైతం రాజ్యసభలో పసుపు బోర్డుపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే అంశం ప్రతిపాదనలో లేదని తేల్చి చెప్పారు. దీంతో బాండు రాసి ఎంపీగా ఎన్నికైన ధర్మపురి అరవింద్ రైతులను మోసం చేశాడు అంటు గ్రామాలలో వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పసుపు బోర్డును పాలమూరు ప్రజాగర్జనలో ప్రకటించారు. వెంటనే కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్ విడుదల చేసినప్పటికిని, పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారో.. స్పష్టత ఇవ్వలేదు.

ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా జాతీయ పసుపు బోర్డుకు చైర్మన్ గా జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అంకాపూర్ గ్రామానికి చెందిన పల్లె గంగారెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.

నిజామాబాద్ జిల్లాలో స్పైస్ రీజినల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీని గత ఏడాది 17వేల నుండి 18 వేల వరకు పసుపు పంటకు మద్దతు ధర వచ్చింది.

దీంతో పసుపు రైతులు పసుపు బోర్డ్ ఏర్పాటుతో తమకు మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారు. యంపి అరవింద్ కృషిని ప్రశంసిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments