రైల్వే పట్టాలు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని మహిళను రైలు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.పాత రాజంపేట గ్రామ పరిధిలో గల వెల్మ కన్వెన్షన్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే ఎస్ఐ సాధు లింబాద్రి తెలిపారు. సుమారు 40 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళ రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మహిళ తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు, రెండు కాళ్లు విరిగిపోవడంతో ఆమె సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎటువంటి గుర్తింపు కార్డులు లభించలేదు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు లేదా ఆమెను గుర్తించిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
