స్వాతంత్ర్య సమరానికి ముందే బ్రిటీష్ పాలనపై గర్జించిన వీర యోధుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యాధ్యక్షుడు వడ్డే ఓబన్న అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త కొనియాడారు.
ఆదివారం నాగారం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న 219వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓబన్న విగ్రహాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో ఓబన్న చూపిన ధైర్యసాహసాలు అపూర్వమని అన్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కుడిభుజంగా ఉండి, సైన్యాన్ని నడిపించి ఆంగ్లేయులను గడగడలాడించిన ఘనత ఆయనదన్నారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన వీరుడి ఉదంతం చరిత్ర పుటల్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
సంచార జాతికి చెందిన వడ్డెర సామాజిక వర్గం దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిందని, వారి త్యాగాలకు తగిన గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వడ్డెర సమాజం విద్య, ఉపాధి రంగాల్లో రాణించాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని సామాజికంగా ఎదగాలని సూచించారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఓబన్న జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు, పెద్దలు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
