సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ యూనిట్‌కు చెందిన ఆయుధ విభాగంలో ఆధునిక ఆయుధాలు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రెజిమెంట్‌లోకి తాళాన్ని పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
మొత్తం 12 అత్యాధునిక ఆయుధాలు మిస్సైనట్లు ఆర్మీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇందులో 4 ఏకే-47లు, 6 పిస్టల్స్, ఒక ఇన్సాస్ రైఫిల్ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు . వీటితో పాటు మందుగుండు సామగ్రి కూడామాయం అయింది.
ఆర్మీ అధికారుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై అత్యంత రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆయుధాల విభాగంలో ఉన్న నాలుగు ఏకే-47 తుపాకులు సహా మరికొన్ని ఆయుధాలు మాయం అయినట్లు గుర్తించారు ఈ మేరకు మిలటరీ బ్రిగేడియర్ బొల్లారం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆయుధాలు ఎలా మాయమయ్యాయనే విషయంపై ఆర్మీ అధికారులు అంతర్గతంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. తోటి అధికారికి సెలవు విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆయుధాలు ఎత్తుకెళ్లినట్లు ఒక కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.ఆయుధాలు మిస్సింగ్ కావడంతో బొల్లారం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆర్మీ, సివిల్ రహదారుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బొల్లారంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లను అధికారులు మూసివేశారు.మిస్సింగ్ అయిన ఆయుధాల కోసం ఆర్మీ అధికారులు, పోలీసులు గాలింపు చేపట్టారు.
ఆయుధాల విభాగంలో విధులు నిర్వహించిన సిబ్బంది వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజీ, రాకపోకలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
