HomeTelanganaNizamabadఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమాయే?బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులచారి ధ్వజం..

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమాయే?బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులచారి ధ్వజం..

జిల్లా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌ ఎదుట నిరసన..అడిషనల్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత..ఆరు గ్యారంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌, రెండు సంవత్సరాలు గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి విమర్శించారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, జిల్లాలోని ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ శ్రేణులు గళమెత్తాయి. సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులచారి నేతృత్వంలో కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది.

శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ముందస్తుగా పలువురు నేతలను అరెస్టు చేసినప్పటికీ, జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో నేతలు కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..యువతకు జాబ్‌ క్యాలెండర్‌ లేదు, నిరుద్యోగ భృతి ఊసే లేదని ధ్వజమెత్తారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ల కోసం అర్హులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని, కొత్త పెన్షన్లు మంజూరు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.

గృహ నిర్మాణ పథకం, కళ్యాణ లక్ష్మి నిధుల విడుదలపై ఉన్న శ్రద్ధ ప్రచారాలపై లేదని ఆరోపించారు. *ఇందూరుపై బడ్జెట్‌ వివక్ష!* ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు జరిగిన అన్యాయాన్ని ఆయన ఎండగట్టారు. జిల్లా అభివృద్ధిని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పిన హామీ ఏమైంది? బడ్జెట్‌లో పైసా ఎందుకు కేటాయించలేదనీ ప్రశ్నించారు.

తెలంగాణ యూనివర్సిటీని విస్మరించి, హైదరాబాద్‌లోని వర్సిటీలకు వేల కోట్లు కేటాయించడం జిల్లా విద్యావ్యవస్థపై వివక్షే అని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ 21, 22 పనులకు, మంచిప్ప రిజర్వాయరుకు నిధులు సున్నా అని ఎద్దేవ చేశారు.జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్‌, నిజామాబాద్‌ రింగ్ రోడ్ల ప్రస్తావన బడ్జెట్‌లో ఎక్కడా లేకపోవడం శోచనీయం అన్నారు.

గల్ఫ్‌ బాధితులకు ఇస్తామన్న రూ.5 లక్షల పరిహారం, సంక్షేమ బోర్డు హామీలు నీటి మూటలయ్యాయి. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలను పరిష్కరించాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments