ఆర్మూర్: జిల్లాలో ఆహార పదార్థాల కల్తీ పెరిగింది. పురుగు పట్టిన… కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ నూనెలు, మసాలాలు, అపరిశుభ్రమైన కిచెన్లతో పలు హోటల్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండిలు, ఐస్ క్రీమ్ పార్లర్ లో ఇదే పరిస్థితి కనబడుతుంది.
ఇటీవల కాలం చెల్లిన కేకును అమ్ముతున్న ఓ బేకరీ ఆర్మూర్ పట్టణంలో ఆహార ప్రియుల్లో కలవరం రేపగా, ఆ ఘటన మరువకముందే… తాజాగా పేర్కిట్ రోడ్డులో గల ఓ బేకరీలో కాలం చెల్లిన చాక్లెట్లను విక్రయించడంతో అది తిని చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాలం చెల్లిన చాక్లెట్లను తిన్న చిన్నారులు వాంతులు విరోచనాలు గురికావడంతో విషయం కాస్త పోలీస్ స్టేషన్కు వెళ్ళినట్లు సమాచారం.
దీంతో రంగంలోకి దిగిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసి మామ అనిపించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆర్మూర్ లోని పలు బేకరీలు హోటల్ లపై ఫుడ్ ఇన్స్పెక్టర్ల నిఘా కొరవడింది. అంతేకాకుండా పలు హోటల్లు రెస్టారెంట్లలో మళ్ళీ మళ్ళీ వాడిన నూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్టు సమాచారం. పనిచేయని ఫ్రీజర్లలో నిలువ ఉంచిన ఆహార పదార్థాలను కస్టమర్లకు అందిస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నారు.
గడువు ముగిసిన ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. గుమగుమలాడే వాసనలు, ఆకర్షణీయరంగులు, వేడివేడిగా వడ్డించడం ఆకట్టుకుంటున్న అది తింటే మాత్రం అనారోగ్యం తథ్యం. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఆహార భద్రత విభాగం వీటి వైపు కన్నెత్తి చూడడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్మూరు పట్టణంలో సగానికి పైగా చోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తూ కొనసాగుతున్న ఈ ఆహార కల్తిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడితే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
కొన్ని రెస్టారెంట్లలో నకిలీ బ్రాండ్లతో కూడిన వాటర్ బాటిల్ లు భోజనం ప్రియులకు అందిస్తున్నారు. మరికొన్ని సూపర్ మార్కెట్లలో చాక్లెట్ లు గడువు తీరిపోయి లీక్ అవుతున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. నాణ్యత మెరుగుపరుచుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంతగా సూచిస్తున్న ‘ఫుడ్ క్రిమినల్స్’ కు అవి ఏమాత్రం పట్టడం లేదు.
మురికిమయమైన వంటగదులు, మురుగునీరు, మూత లేని డస్ట్ బీన్లు, బొద్దింకలు, ఈగల మధ్య ఆహారాన్ని తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సింథటిక్ కలర్స్ వాడుతూ తమలోని ధన దాహాన్ని చాటుకుంటున్నారు. కాలం చెల్లిన బిస్కెట్లు… గడువు తీరిన ఫిజ్జాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్స్పైరీ తేదీలు లేని కేకులు అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి.
పలు హోటలలో నాణ్యతలేని కల్తీ నూనెను వాడుతూ భోజనాన్ని సిద్ధపరుస్తున్నారు. ఇప్పటికైనా ఈ ఆహార కల్తీ కి ఎగబడుతున్న పలు బేకరీలు హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిఘవేయాలని ప్రజలు కోరుతున్నారు.