HomeCRIMEకాంగ్రెస్ లో క్లైమోర్ మైన్స్ చిచ్చు…..చంద్రశేఖర్ రెడ్డి అరెస్టు లో చక్రం తిప్పిందెవరో ? సీఎంవో...

కాంగ్రెస్ లో క్లైమోర్ మైన్స్ చిచ్చు…..చంద్రశేఖర్ రెడ్డి అరెస్టు లో చక్రం తిప్పిందెవరో ? సీఎంవో దాక చేరిన పంచాయితీ ……..

కామారెడ్డి కాంగ్రెస్ లో కల్లోలం రేగింది. బండరాళ్లు పేల్చడానికి ఉపయోగించే క్లైమోర్ మైన్స్ చిచ్చు రేపాయి. సీఎం రేవంత్ కుటుంబానికి సన్నిహితుడిగా ముద్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టు వెనుక ఎవరు చక్రంచెప్పారనేది ఆసక్తిగా మారింది. అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపిన ఈ వ్యవహారం సీఎంవో దాక వెళ్ళింది.

రేవంత్ రెడ్డి కామారెడ్డి లో పోటీ చేసినప్పుడు అత్యంత క్రియా శీలకంగా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి ని ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి నిజామాబాద్ జైలుకు తరలించడం అధికార పార్టీలో ప్రకంపనలు రేపింది.

ఈ వ్యవహారంలో కామారెడ్డి పోలీసులదూకుడు వెనుక ఎవరి. ఒత్తిళ్లు ఉన్నాయనేది పీసీసీ సైతం అరా తీస్తుంది.అధికార పార్టీ నే ఇరుకున పెట్టేలా చేసిన ఈ ఉదంతంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీనికి మూలం మూడు రోజుల కిందట మొదలైంది. కామారెడ్డిలోని కేపీఆర్ కాలనీలో ఓ వ్యక్తి ప్లాటులో బండరాళ్లు పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర పేలుడు సామగ్రి తెప్పించాడు. ఓ కాంట్రాక్టర్ 50 వేల రూపాయలకు ఒప్పందం చేసుకుని పేలుడు సామగ్రి తీసుకొచ్చాడు. మొన్న రాత్రి రాళ్లను పేల్చేందుకు ఏర్పాట్లు చేసుకోగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు సంపత్, లక్ష్మీనారాయణ, రాజు, శ్రీధర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే, నిందితులు ఈ సామగ్రిని లింగపూర్ గ్రామ సమీపంలోని శ్రీవారి వెంచర్ నుండి తెచ్చామని పోలీసుల విచారణలో వెల్లడించడంతో దాని యజమానులైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, అతని అన్న సురేందర్ రెడ్డి అలియాస్ సూర్యంపై కూడా కేసు నమోదు చేశారు.


సరిగ్గా ఇక్కడే పోలీసులు తమ దూకుడు ప్రదర్శించారు. సాధారణంగా చాలా చోట్ల, రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్ద ఇలాంటి జిలెటిన్ స్టిక్స్ వాడుతుంటారు. అవి దొరికినప్పుడల్లా వారిని ఉపయోగించిన వారిపై కేసు పెట్టి చేతులు దులుపుకుంటారు. కానీ, కామారెడ్డి పోలీసులు మాత్రం ఒకడుగు ముందుకేసి వివాదాల్లో చిక్కుకున్నారు.

వాస్తవానికి ఈ మందుగుండు సామగ్రి దొరికిందని చెబుతున్న శ్రీవారి వెంచర్ లో గడ్డం చంద్రశేఖర్ కు ఎలాంటి భాగస్వామ్యం లేదు. కనీసం ఆయన పేరిట గజం స్థలం కూడా లేదు. సుమారు రెండేళ్ల కిందట ఈ వెంచర్ పనులు జరిగాయి. ఇలాంటి సందర్భంలో చంద్రశేఖర్ ను ఆగమేఘాల మీద పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి స్టేషన్ కు పిలిపించి అటు నుండి అటే రిమాండ్ కు తరలించారు.

ఓ సీఐ ఆధ్వర్యంలో ఎస్పీ పిలుస్తున్నారని చెప్పి వాహనం ఎక్కించారు. నేరుగా బాన్సువాడ వైపు నుండి బిచ్కుంద తీసుకెళ్లారు. తర్వాత నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించారు. ఇదంతా పక్కా ప్లాన్ తో నాటకీయంగా జరగడం వెనుక రాజకీయ కుట్ర ఉందని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, చంద్రశేఖర్ భార్య ఇందుప్రియ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ఆరోపణలు చేశారు. శ్రీవారి వెంచర్ కు, తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.


అయితే, ఏకంగా అధికార పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని పోలీసులు అరెస్టు చేయడంతో విషయం అధినేతలకు చేరింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై ఆరా తీసినట్లు సమాచారం. వెంటనే ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమ పార్టీని, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తారా అని ఆగ్రహించినట్లు సమాచారం.

కనీసం తమకు కానీ, టీపీసీసీ అధ్యక్షుడికి కానీ తెలియకుండా ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఇదంతా కామారెడ్డికి చెందిన సొంత పార్టీ నేతల కనుసన్నల్లోనే జరిగినట్లు భావిస్తున్నారు. ఓ మాజీమంత్రి సోదరుడు స్వయంగా కామారెడ్డి పోలీసు అధికారులకు చెప్పి చంద్రశేఖర్ ను అరెస్ట్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.

చంద్రశేఖర్ రెడ్డి కి టీపీసీసీ పోస్ట్ వచ్చినప్పటి నుండి సదరు ముఖ్యనేతకు మింగుడు పడడం లేదు. దీంతో అతన్ని రాజకీయంగా దెబ్బ తీసేందుకు క్లైమోర్ మైన్స్ కేసులో ఇరికించారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments