ఇటుక బట్టీల యజమాని అక్రమ నిర్బంధంలో, కంచె లోపల నరకయాతన అనుభవిస్తున్న కార్మికులకు విముక్తి లభించింది. తమిళనాడు హైకోర్టు జారీ చేసిన అత్యవసర ఉత్తర్వులతో శనివారం ఆర్మూర్ పోలీసులు మగ్గిడిలోని ఇటుక బట్టీలపై మెరుపు దాడి చేశారు.
బందీలుగా ఉన్న అభాగ్యులను సురక్షితంగా రక్షించి వారి స్వస్థలాలకు తరలించారు.బాధితులు, కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన తిరుపతిరెడ్డి అనే వ్యక్తి గతేడాది తమిళనాడు-నెల్లూరు సరిహద్దు ప్రాంతాల నుంచి కొంతమంది నిరుపేద కూలీలను ఆర్మూర్ సమీపంలోని మగ్గిడికి తీసుకొచ్చాడు.
అక్కడ తాను నిర్వహిస్తున్న మూడు ఇటుక బట్టీల్లో వారిని పనిలో పెట్టాడు. అయితే, కొంతకాలంగా వారికి పైసలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాడు. రాత్రీ పగలు తేడా లేకుండా గొడ్డు చాకిరి చేయించుకుంటూ కనీస సౌకర్యాలు కల్పించకుండా వేధించాడు.యజమాని పెడుతున్న బాధలు భరించలేక తాము సొంత ఊళ్లకు వెళ్ళిపోతామని కార్మికులు కోరగా, తిరుపతిరెడ్డి వారిపై అక్రమంగా దాడులకు తెగబడ్డాడు.
కర్రలతో కొడుతూ, తీవ్రంగా హింసిస్తూ బందీలుగా మార్చాడు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచేసి, ఎవరైనా పారిపోవాలని చూస్తే కాళ్ళు విరగ్గొడతామంటూ బాధితులను భయభ్రాంతులకు గురిచేశాడు.బట్టీల నిర్వాహకుడి కళ్ళు గప్పి కొందరు కార్మికులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
దీంతో బాధితుల బంధువులు తమిళనాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఉన్నత న్యాయస్థానం.. బందీలుగా ఉన్న కార్మికులను తక్షణమే విడిపించి రక్షణ కల్పించాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పోలీసులకు అత్యవసర ఆదేశాలు (స్టే) జారీ చేసింది.
కోర్టు ఆదేశాలు అందిన వెంటనే ఆర్మూర్ డివిజన్ ఏసీపీ, టౌన్ సీఐ సత్యనారాయణ, వేల్పురు ఎస్ఐ సంజీవ్,ఇతర ఎస్ఐలు తమ సిబ్బందితో కలిసి మగ్గిడిలోని ఇటుక బట్టీలపై మెరుపు దాడి చేశారు. పోలీసులను చూడగానే కార్మికులు భోరున విలపించారు.
నిర్బంధంలో ఉన్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన పోలీసులు సొంత ఊర్లకు పంపించివేశారు.అమాయక కూలీలను అక్రమంగా నిర్బంధించి, హింసకు గురిచేసిన ఇటుక బట్టీల యజమాని తిరుపతిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
