HomeLaw and Orderజిల్లాలో పని చేయడం గొప్ప అనుభూతిని అందించింది అందరి సహకారంతోనే నిజామాబాద్ ను ముందంజలో...

జిల్లాలో పని చేయడం గొప్ప అనుభూతిని అందించింది అందరి సహకారంతోనే నిజామాబాద్ ను ముందంజలో నిలుపగలిగాం.. వీడ్కోలు సమావేశంలో బదిలీపై వెళ్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి

ఇదే ఒరవడితో ముందుకెళ్తామని నూతన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టీకరణ

నిజామాబాద్ లో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని, జిల్లాతో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనిదని జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.

ఆయన బదిలీపై వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన టి.వినయ్ కృష్ణారెడ్డికి ఇదే వేదికపై స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు.

అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు బదిలీ అయిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పనితీరును, ఆయనతో కలిసి పని చేసిన అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రెటరీగా బదిలీపై వెళ్తున్న సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, కలెక్టర్ గా తాను జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కింది స్థాయి ఉద్యోగి మొదలుకుని ప్రతి శాఖకు చెందిన అధికారులందరూ అన్ని విషయాల్లోనూ ఎంతగానో సహకరించారని అన్నారు.

వారి తోడ్పాటు కారణంగానే జిల్లాను ధాన్యం సేకరణ వంటి అనేక అంశాలలో ముందంజలో నిలుపగలిగామని, వరుసగా వచ్చిన శాసన సభ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సమర్ధవంతంగా నిర్వహించడంలో సఫలీకృతం కాగలిగామని అన్నారు.

ముఖ్యంగా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున నిజామాబాద్ జిల్లాలో పని చేయడం వల్ల ధాన్యం సేకరణ, పసుపు, ఎర్రజొన్న వంటి అంశాలతో పాటు, సాగు రంగంపై మంచి అనుభవం ఏర్పడిందని, మునుముందు నిర్వర్తించే విధులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు.

నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎంతో మంచివారని, అన్ని వర్గాల వారు అందించిన సహకారంతోనే జిల్లాను ప్రగతి దిశలో ముందంజలో నిలుపగలిగామని అన్నారు. జిల్లా పాలనాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు.

జిల్లాకు సమర్ధవంతమైన అధికారి కలెక్టర్ గా వచ్చారని, ఆయన నేతృత్వంలో జిల్లా మరింతగా ప్రగతి దిశగా పయనిస్తుందనే పూర్తి నమ్మకం ఉందన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తిస్తూ అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, తనకు తోడ్పాటును అందించిన రీతిలోనే నూతన కలెక్టర్ కు కూడా పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందించాలని హితవు పలికారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బదిలీపై వెళ్తున్న రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కలెక్టర్ గా తనదైన ప్రత్యేకతను చాటారని, ఆయన ఒరవడిలోనే ముందుకు సాగుతూ నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో నిలిపేలా కృషి చేస్తానని అన్నారు.

తాను ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతానని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని సూచించారు.

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్ తదితరులు బదిలీపై వెళ్తున్నఐ.ఏ.ఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి పని చేసిన అనుభవాలను నెమరువేసుకున్నారు.

వీడ్కోలు సమావేశంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు ఉద్యోగ సంఘాల జె ఏ సి చైర్మన్ అలుక కిషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, టీఎన్జీఓ ల సంఘం అధ్యక్షుడు సుమన్, పీఆర్టీయూ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి.మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments