రాబోయే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసిన వార్డుల వారీ ఓటర్ల జాబితాలో అనేక వ్యత్యాసాలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారికి పార్టీ ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సమీర్ అహ్మద్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు అజారుద్దీన్ ఉమ్మడిగా మాట్లాడుతూ, ఓటర్ల జాబితా రూపకల్పనలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న లోపాలపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఏ ఒక్క అధికారి కూడా బాధ్యతాయుతంగా స్పందించడం లేదని వారు మండిపడ్డారు.
అధికారుల ఈ ఉదాసీనత వల్ల సామాన్య ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వార్డుకు చెందిన వేలాది మంది ఓటర్ల పేర్లను ఇతర వార్డుల జాబితాలో అస్తవ్యస్తంగా చేర్చారు. భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా కొన్ని పూర్తి బ్లాకులను ఇతర వార్డులలోకి మార్చడం జరిగిందన్నారు.
ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని కోరితే, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని వారు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన చేయించాలి.డీలిమిటేషన్ మ్యాప్‌ల ప్రకారం ఓటర్లను వారి అసలైన వార్డులకు కేటాయించాలి.
ఎన్నికల తుది నోటిఫికేషన్ కంటే ముందే దోషరహితమైన ఓటర్ల జాబితాను విడుదల చేయాలనీ అన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తన వార్డులోనే ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
