నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, నగరాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు.
ఆదివారం జిల్లా కేంద్రంలో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. 60 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ లతో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. “రాష్ట్రంలోనే నిజామాబాద్‌ను మేటి జిల్లాగా నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నాం. అందరి సహకారంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం” అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు.జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు.
